ప్రభుత్వం ఏర్పాటులో తాలిబన్లు వెనుకంజ!

ప్రభుత్వం ఏర్పాటులో తాలిబన్లు వెనుకంజ!

ఆఫ్ఘనిస్థాన్‌ను మరోసారి పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటులో వెనుకడుగు వేస్తున్నారు. ఈ ప్రక్రియను ఇప్పటి వరకు రెండు సార్లు వాయిదా వేశారు. తొలుత శుక్రవారం ప్రార్థనల అనంతరం గ్రూప్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బారదార్ సుప్రీం కమాండర్‌గా కొత్త ప్రభుత్వాన్ని ప్రకటిస్తామని తాలిబన్‌ తెలిపింది.

అయితే ఇది శనివారానికి వాయిదా పడింది. కాగా, కొత్త ప్రభుత్వం, కేబినెట్‌ మంత్రులను మరో రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తామని తాలిబన్‌ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ శనివారం తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై ఆయన ఎలాంటి కారణం చెప్పలేదు.

అంతర్జాతీయ సమాజానికి ఆమోదయోగ్యమైన సమగ్ర పరిపాలనను రూపొందించడంపై తాలిబన్లు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు వివిధ గ్రూపులతో చర్చల కోసం ఒక కమిటీని కూడా నియమించారు.

‘తాలిబాన్లు తమంతట తాముగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. కానీ వారు ఇప్పుడు అన్ని పార్టీలు, సమూహాలు, సమాజంలోని వర్గాలకు సరైన ప్రాతినిథ్యం ఉండే పరిపాలనపై దృష్టిసారించారు’ అని కమిటీ సభ్యుడు, కాబూల్‌ సెక్యూరిటీ ఇంఛార్జ్‌ ఖలీల్ హక్కానీ తెలిపారు.

‘ఆఫ్ఘన్‌ ప్రజలకు భద్రత కల్పించే సామర్థ్యం తాలిబన్లకు ఉన్నది. కానీ, ఒక క్రియాత్మక ప్రభుత్వాన్ని నడపడానికి యువత, విద్యావంతులైన ఆఫ్ఘన్‌ల ప్రాతినిథ్యం, సహకారం అవసరం. కాలం చెల్లిన రాజకీయ నాయకులు అని పిలిచే వారిని పూర్తిగా పక్కన పెట్టాలి’ అని స్పష్టం చేశారు. తద్వారా సంకీర్ణ ప్రభుత్వం విఫల అనుభవం పునరావృతం కాకూడదు” అని ఖలీల్ హక్కానీ ట్వీట్‌ చేశారు.

మాజీ ప్రధాని గుల్బుద్దీన్ హెక్‌మత్యార్, పదవీచ్యుతుడైన ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సోదరుడు హష్మత్ ఘనీ అహ్మద్‌జాయ్‌కు ప్రభుత్వంలో ప్రాతినిథ్యం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మరోవంక, పంజ్‌షీర్‌ ప్రతినిధులతో తాలిబన్ల చర్చలు విఫలమయ్యాయి. దీంతో తాలిబన్లపై పోరాటాన్ని రెబల్‌ దళాలు తీవ్రం చేశాయి. తాలిబన్‌ ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యానికి ఇది కూడా ఒక కారణం కావచ్చని తెలుస్తున్నది.

ఐఎస్ఐ చీఫ్ ఆకస్మిక కాబూల్ పర్యటన!

ప్రభుత్వం ఏర్పాటులో తాలిబన్లు వెనుకంజ వేస్తున్న సమయంలో పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్ జనరల్ ఫయీజ్ హమీద్ శనివారం అకస్మాత్తుగా ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరింప చేసుకొంటున్నది. తాలిబన్లను ప్రభావితం చేసే బయటి శక్తి పాకిస్థాన్ అనే విషయం తెలిసిందే. 
 
పంజ్‌షీర్ లోయలో తాలిబన్లు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సమయంలో జనరల్ ఫయీజ్ కాబూల్‌లో పర్యటిస్తున్నారు. ఆయనతోపాటు పాకిస్థానీ అధికారుల బృందం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ పాకిస్థానీ పాత్రికేయుడిని ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ తెలిపిన సమాచారం ప్రకారం, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ భవిష్యత్తుపై చర్చించేందుకు రావాలని తాలిబన్లు కోరడంతో జనరల్ ఫయీజ్ కాబూల్‌లో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది.
అఫ్ఘాన్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో తాలిబాన్లు, హక్కానీ నెట్‌వర్క్‌ నేతల మధ్య విభేదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. తాలిబాన్‌ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌(ఒంటికన్ను ఒమర్‌) కుమారుడు ముల్లా యాకూబ్‌, కాబోయే అధ్యక్షుడు ముల్లా బరాదర్‌ తమ సర్కారులో మిలటరీ యోధుల్ని నియమించాలని నిర్ణయించారు. 
 
అయితే  హక్కానీ నెట్‌వర్క్‌ వ్యతిరేకించిందని, తమ వారికి ప్రాధాన్యతనివ్వాలని పట్లుబట్టిందని సమాచారం. హక్కానీ నెట్‌వర్క్‌ ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఉగ్ర జాబితాలో ఉండగా.. దాన్ని నడుపుతున్న పాకిస్థాన్‌ నిఘా విభాగం ఐఎస్ఐ అనేది బహిరంగ రహస్యమే. ఇప్పుడు ఈ వ్యవహారంలో పాక్‌ తలదూరుస్తోంది. పాక్‌ ఐఎస్ఐ చీఫ్‌ హమీద్‌ ఫయాజ్‌ ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చే దిశలో హమీద్‌ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.