క‌శ్మీర్ విష‌యంలోనూ మాటమార్చిన తాలిబ‌న్లు

క‌శ్మీర్ విష‌యంలోనూ మాటమార్చిన తాలిబ‌న్లు
కాబుల్ ను స్వాధీనంలోకి తెచ్చుకొనే సమయంలో తాము మారిపోయామని చెప్పిన తాలిబన్లు వరుసగా మాటమారుస్తున్నారు. మహిళల విషయంలో మాటమార్చిన వారు తాజాగా కాశ్మీర్ విషయంలో కూడా మార్చారు. ఇప్పటివరకు అది ద్వైపాక్షిక అంశమని,, తాము తలదూర్చమని చెబుతూ వచ్చిన తాలిబన్లు తాము జోక్యం చేసుకొంటామని స్పష్టమైన సంకేతం ఇచ్చారు. 

 వ‌చ్చిన కొత్త‌లో క‌శ్మీర్ అంత‌ర్గ‌త విష‌య‌మ‌ని, అది భారత్,  పాకిస్థాన్ ద్వైపాక్షిక అంశ‌మ‌న్న వాళ్లు.. ఇప్పుడు క‌శ్మీర్ ముస్లింల గురించి మాట్లాడే హ‌క్కు త‌మ‌కుంద‌ని స్పష్టం చేయడం గ‌మ‌నార్హం. బీబీసీ ఉర్దూతో మాట్లాడిన తాలిబ‌న్ అధికార ప్ర‌తినిధి సుహైల్ ష‌హీన్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు. 

“ఈ హ‌క్కు మాకుంది. ముస్లింలుగా క‌శ్మీర్‌, భారత్  స‌హా ఏ దేశంలోని ముస్లింల కోస‌మైనా గ‌ళ‌మెత్తే హ‌క్కు మాకు ఉంది” అని ష‌హీన్ స్పష్టం చేశారు. అయితే ఏ దేశంపైనా తాము ఆయుధాలు ఎక్కుపెట్ట‌బోమ‌ని కూడా అత‌ను స్ప‌ష్టం చేశాడు. అమెరికాతో దోహాలో కుదుర్చుకున్న ఒప్పందంలో మరే దేశంపై తుపాకీ ఎక్కుబెట్టబోమని మాత్రమే హామీ ఇచ్చామని, ఇతరుల గురించి మాట్లాడమని చెప్పలేదని గుర్తు చేశారు.

ముస్లింలు మీ సొంత మ‌నుషులు, మీ దేశ పౌరులు. మీ చ‌ట్టాల ప్ర‌కారం వాళ్ల‌కు కూడా స‌మాన హ‌క్కులు ఉండాల‌ని మేము గ‌ళ‌మెత్తుతాం అని ష‌హీన్ చెప్పాడు. ఆఫ్ఘ‌న్ భూభాగం భారత్  వ్య‌తిరేక ఉగ్ర‌వాద శ‌క్తుల అడ్డాగా మార‌కూడ‌ద‌ని ఈ మ‌ధ్య తాలిబ‌న్ల‌తో చ‌ర్చ‌ల సంద‌ర్భంగా భార‌త ప్ర‌భుత్వం తేల్చి చెప్పిన విష‌యం తెలిసిందే.  ఖ‌తార్‌లో భారత రాయ‌బారి దీపిక్ మిట్ట‌ల్ తాలిబ‌న్ నేత షేర్ మ‌హ్మ‌ద్‌ను క‌లిసి ఈ విష‌యాన్ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో వాళ్ల నుంచి క‌శ్మీర్‌పై ఇలాంటి ప్ర‌క‌ట‌న రావ‌డం గ‌మ‌నార్హం.

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడబోతుండటంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మన దేశంపై ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ఆఫ్ఘన్ గడ్డను ఉపయోగించుకోకుండా చూడటంపైనే దృష్టి సారించినట్లు తెలిపారు. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించడం గురించి ఇప్పుడే మాట్లాడటం త్వరపడటం అవుతుందని చెప్పారు.