
రాఫెల్స్ ల్యాండయ్యాయి కానీ రాహుల్ మాత్రం టేకాఫ్ కాలేదని రాఫెల్ విమానాల కొనుగోలు వ్యవహారంపై తరచు కేంద్రంపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎద్దేవా చేశారు.
కెవాడియాలో గురువారం ప్రారంభమైన మూడు రోజుల గుజరాత్ రాష్ట్ర బిజెపి కార్యవర్గ సమావేశంలో రాజ్‌నాథ్ రక్షణ సామగ్రి సేకరణపై మాట్లాడుతూ, రాఫెల్‌ను కాంగ్రెస్, రాహుల్ గాంధీ ఒక అంశం చేశాయని, ఈ విమానాలు ఇప్పుడు భారత్ లో ల్యాండ్ అయ్యాయని గుర్తు చేశారు.
అయితే, రాహుల్ మాత్రం ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టు ఇంతవరకూ టేకాఫ్ తీసుకోలేదని అవహేళన చేశారు. ఇటీవల జరిగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగక పోవడంపై విపక్షాల వైఖరిని తప్పుపట్టారు. విపక్షాలు ఉన్నదే వ్యతిరేకించడానికనే భావం వల్లే పార్లమెంటు సమావేశాలకు అంతరాయాలు ఏర్పడ్డాయని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ కేవలం తమను తాము ప్రమోట్ చేసుకోవడానికే పరిమితమవుతూ, ప్రజాస్వామ్యాన్ని, మహాత్మాగాంధీల పేరును దుర్వినియోగం చేస్తోందని తప్పుపట్టారు. గాంధీ పేరును గరిష్టంగా వాడుకుంటూ, గాంధీజీ ఆశయాలను సాకారం చేయడంలో మాత్రం మరిచిపోయారని విమర్శించారు. పైగా,అవినీతిని వ్యవస్థాగతం చేశారని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పాలనలో జవాబుదారీతనాన్ని పోలుస్తూ, గతంలో 100 పైసలకు 16 పైసలు మాత్రమే లబ్ధిదారులకు చేరుతున్నాయనే ఫిర్యాదులు వచ్చావని, మోదీ హయాంలో డీబీటీ ద్వారా లబ్ధిదారుల అకౌంట్లలోకే సొమ్ములు నేరుగా చేరుతున్నాయని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజావిశ్వాసంతో గెలుపు సాధించడంలో బీజేపీ ముందుంటుందని భరోసా వ్యక్తం చేశారు. యూపీ, గుజరాత్ ఎన్నికల పరిణామాలపై కేవలం భారతీయులే కాకుండా విదేశాల్లోని రాజకీయ విశ్లేషకులు కూడా ఆసక్తిగా చూస్తున్నారని తెలిపారు.
ఆఫ్ఘనిస్తాన్ నుండి 500 మంది భారతీయులు, ఆఫ్ఘన్ జాతీయులను విజయవంతంగా ఖాళీ చేయడాన్నిప్రస్తావిస్తూ భారత పౌరులను రక్షించే ప్రశ్న వచ్చినప్పుడు ప్రభుత్వం శ్రద్ధగా పనిచేస్తుందని గుర్తు చేశారు. “ఒక భారతీయ పౌరుడి జీవితం, ఆస్తిని కాపాడటం మనకు ప్రాధాన్యతమైన అంశం. అందుకే భారతీయ పౌరులను కాపాడాలనే ప్రశ్న వచ్చినప్పుడు, మనప్రభుత్వం వారిని విదేశాల నుండి కూడా బయటకు తీసుకురావడానికి శ్రద్ధగా పనిచేస్తుంది” అని ఆయన చెప్పారు.
“ఆత్మనిర్భర్ భారత్” తయారీ దిశలో, మనం మొదట రక్షణ, భద్రతా రంగంలో స్వయంసమృద్ధిని సాధించాలి. ఈ పని చాలా సవాలుగా ఉంది, కానీ మనం ప్రారంభించాము “అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రక్షణ పరికరాల మొత్తం కొనుగోలులో 64 శాతం భారతదేశం నుండి కొనుగోళ్లకు రిజర్వ్ చేసిన్నట్లు వెల్లడించారు.
“రక్షణ రంగంలో స్వావలంబన కోసం ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నాము. భారతదేశంలో రక్షణ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నాము. మొత్తం కొనుగోలులో 64 శాతం భారతదేశంలో తయారు చేసిన రక్షణ పరికరాల కొనుగోలు కోసం రిజర్వ్ చేయబడింది” అని ఆయన చెప్పారు. ఉగ్రవాదులు తమ లక్ష్యాలను నెరవేర్చుకొనేందుకు అనుమతించడం లేడనై, అందుకనే గత ఏడేళ్లలో పెద్ద ఉగ్రవాద కార్యకలాపాలు జరగలేదని రక్షణ మంత్రి చెప్పారు.
“ఈ రోజు, ఉగ్రవాదులు కూడా తాము ఆశ్రయం పొందుతున్న చోట కూడా తాము సురక్షితంగా లేమని తెలుసుకున్నారు. ఊరిలో ఒక సంఘటన జరిగినప్పుడు, మన సైన్యం సరిహద్దు దాటి వెళ్లి ఉగ్రవాదుల గూడులను ధ్వంసం చేసింది” అని రక్షణ మంత్రి గుర్తు చేశారు. రాజ్‌నాథ్ సింగ్ గుజరాత్‌కు వచ్చిన కొద్ది సేపటి తర్వాత, ఆయన గుజరాత్‌లోని కెవాడియాలోని ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని సందర్శించి, సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
More Stories
సందడిగా దత్తాత్రేయ `అలయ్ బలయ్’
ఆర్ఎస్ఎస్ అంకితభావం, సేవకు అరుదైన ఉదాహరణ.. దలైలామా
భీమస్మృతి మనకు మార్గదర్శకం, మనుస్మృతి కాదు