ఆఫ్రికా నగదు లావాదేవీలపై పూరీని నిలదీసిన ఈడీ

ఆఫ్రికా నగదు లావాదేవీలపై పూరీని నిలదీసిన ఈడీ
కొన్నేళ్ల క్రితం జోరుగా సాగిన టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో మనీ లాండరింగ్ కోణంపై 12 మంది సెలెబ్రెటీలను ప్రశ్నించడం ప్రారంభించిన ఈడీ అధికారులు మొదటగా విచారించిన ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ను ఆఫ్రికా దేశాలతో నగదు లావాదేవీలపై నిలదీసిన్నట్లు తెలుస్తున్నది. 
మంగళవారం ఉదయం 10.15 గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి త‌న కుమారుడు ఆకాశ్‌ పూరి, చార్టెడ్‌ అకౌంటెంట్‌ శ్రీధర్‌తో పాటు వ‌చ్చారు. విచార‌ణ‌కు పూరీ హాజ‌రు కాగా ఆయ‌న‌ను 10గంట‌ల‌కు పైగా ప్ర‌శ్నించిన‌ట్టు తెలుస్తుంది.

విచార‌ణ‌లో భాగంగా ఆఫ్రికా దేశాలకు నగదు ఎందుకు పంపారు!? ఆఫ్రికన్ల బ్యాంకు ఖాతాల్లోకి నగదు పంపడానికి కారణమేమిటి? మీ బ్యాంకు ఖాతాల్లో ఈ అనుమానాస్పద లావాదేవీలేంటి!? అని ఈడీ ప్ర‌శ్న‌లు గుప్పించింది. ముగ్గురు ఆఫ్రికా డ్రగ్‌ పెడలర్ల ఫొటోలను ఈడీ అధికారులు చూపించి వారెవరో తెలుసా? అని ప్రశ్నించారు. తనకు తెలియదని పూరీ సమాధానమిచ్చారు.

బ్యాంకు లావాదేవీల స్టేట్ మెంట్లను వెంట తెచ్చిన పూరీ జగన్నాథ్ వాటిని అధికారులకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వివిధ కేసుల్లో నిందితులు చెప్పిన వివరాల్ని.. పూరీ బ్యాంకు ఖాతాలు.. ఆయన చెప్పిన వివరాల్ని బ్యాంకు స్టేట్ మెంట్లలో క్రాస్ చెక్ చేసినట్లు సమాచారం. 

విదేశాల్లో సినిమా షూటింగ్ జరిగినప్పుడు అక్కడ చోటు చేసుకున్న లావాదేవీలపై ఆరా తీసినట్లు చెబుతున్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఆయ‌న‌ను మళ్లీ పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. తాము పిలిచినప్పుడు మళ్లీ రావాలని పూరీకి అధికారులు చెప్పి పంపినట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి.