
తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన ఆఫ్ఘనిస్థాన్ వరుసగా బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతున్నది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా తన బలగాలను పూర్తిగా తరలించడానికి ఒక రోజు ముందు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్ల దాడి జరిగింది. ఎయిర్పోర్ట్ లక్ష్యంగా ఉగ్రవాదులు ఐదు రాకెట్లను ఫైర్ చేశారు. అయితే వీటిని మిస్సైల్ రక్షణ వ్యవస్థ సమర్థంగా అడ్డుకున్నట్లు అమెరికా అధికారి ఒకరు రాయ్టర్స్కు వెల్లడించారు. కానీ ఇందులో ఒక రాకెట్ మాత్రం ఎయిర్పోర్ట్ పక్కేనే ఉన్న ఓ నివాసిత భవనానికి తగిలింది.
ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నది. రానున్న 24-36 గంటల్లో కాబూల్ పరిసరాల్లో ఉగ్రదాడులు జరుగొచ్చని అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ దాడులు జరుగడం గమనార్హం. అమెరికా సైనికులే లక్ష్యంగా జరిగినట్టు భావిస్తున్న ఈ దాడుల వెనుక ఐసిస్-కే హస్తం ఉన్నట్టు అనుమానం.
మరోవైపు, అఫ్ఘనిస్థాన్‌లో ఐసిస్ ఆత్మాహుతి దళంపై అమెరికా సేనలు ఆదివారం వైమానిక దాడికి దిగింది. కాబూల్ ఎయిర్‌పోర్టును లక్షంగా చేసుకుని అఫ్ఘన్ ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్ధ (ఐఎస్ఐఎస్ కె) బహుళ సంఖ్యలో ఆత్మాహుతి బాంబర్లను రంగంలోకి దింపింది. ఈ బాంబర్లు ఓ శకటంలో సంచరిస్తూ ఉన్నారనే ఖచ్చితమైన నిఘా సమాచారంతో అమెరికా సేనలు గగనతలం నుంచి దాడికి దిగాయని అధికారులు తెలిపారు. కాబూల్‌లోని కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికన్లను అమెరికా సేనల సాయంతో స్వదేశానికి తరలిస్తూ ఉన్నారు.
ఈ తరలింపు ప్రక్రియను విచ్ఛిన్నం చేసేందుకు ఐసిస్ మూకలు రంగంలోకి దిగాయి. తమను తాము విమానాశ్రయంలో పేల్చుకుని తద్వారా అమెరికా సేనలకు, తరలివెళ్లే అమెరికన్లకు ముప్పు వాటిల్లేలా చేయాలని వ్యూహం పన్నారు. అయితే దీనిని విఫలం చేస్తూ అమెరికా సకాలంలోనే ముందస్తుగా ఈ శకటాన్ని టార్గెట్‌గా చేసుకుని వైమానిక దాడికి దిగినట్లు అధికారులు తెలిపారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెలుగులోకి రాలేదు.
తమ వైమానిక దాడి విజయవంతం అయినట్లు ఇద్దరు అమెరికా సైనికాధికారులు అనధికారికంగా తెలిపారు. తాము గురిపెట్టి కొట్టిన శకటంలో భారీ స్థాయి పేలుడు పదార్థాలు ఉండి ఉంటాయని, తమ వైమానిక దాడి తరువాతి దశలో ఆ తరువాత రెండు మూడు సార్లు పేలుళ్ల ప్రతిధ్వనులు విన్పించాయని, దీనిని బట్టి ఐసిస్‌లకు భారీ నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు.
ఎయిర్‌పోర్టు వద్ద అమెరికా జరిపిన వైమానిక దాడిని తాలిబన్ల ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ధృవీకరించారు. ఓ సూసైడ్ బాంబరు తన ఆయుధ భరిత శకటంలో సంచరిస్తూ ఉండగా గమనించి దీనిపై వైమానిక దాడి జరిగిందని తెలిపారు. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
More Stories
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్