మోదీ నాయకత్వ లక్షణాలే  ప్రేరణ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ లక్షణాలు తనకు ప్రేరణగా నిలిచాయని యువ కళాకారుడు స్టీవెన్ హారిస్ చెప్పారు. ఆయన ప్రేరణతోనే తాను ఆయన చిత్రాలను గీశానని, వాటిని ఆయన చూసి, తన లేఖను చదివి, తనను ప్రశంసించడం తనకు  చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ప్రధాని చిత్రాలతో ప్రఖ్యాతి పొందడంతో ఈ యువకుడు సంతోషం వ్యక్తం చేస్తున్నది. 

 ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన, ఎదుగుతున్న కళాకారులతో మోదీ నిరంతరం సంబంధాలు కలిగి ఉంటారని, అదే తనకు స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. ఏదో ఒక రంగానికి చెందినవారిని కాకుండా, అన్ని రంగాల వారికి ఆయన ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.

మోదీ వల్ల ప్రేరణ పొంది, తాను రూపొందించిన చిత్రాలను ప్రధాన మంత్రి కార్యాలయానికి నేరుగా పంపించానని తెలిపారు. తనను మెచ్చుకుంటూ మోదీ లేఖ రాస్తారని గట్టి నమ్మకం పెట్టుకున్నానని తెలిపారు. తాను భావించినట్లుగానే మోదీ తనకు లేఖ రాసి, తనను ప్రశంసించడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. 

మోదీ తనను ప్రశంసించడంతో తన కుటుంబ సభ్యులు, కళాశాల మిత్రులు హర్షాతిరేకాలతో తనను అభినందిస్తున్నారని చెప్పారు. నరేంద్ర మోదీ చాలా మందికి, మరీ ముఖ్యంగా యువతకు, ప్రేరణనిస్తున్నారని కొనియాడారు. కనీసం కాస్త సమయం అయినా తీరిక లేకుండా పని చేసే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన లేఖను చదవడం తనకు చాలా ఆనందాన్నిచ్చిందని, ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నానని తెలిపారు. 

బెంగళూరు విద్యార్థి స్టీవెన్ హారిస్ (20) పంపించిన తన పెయింటింగ్స్‌ను ప్రధాని మోదీ ప్రశంసించారని ప్రధాన మంత్రి కార్యాలయం  ఓ ప్రకటనలో తెలిపింది. మోదీ బొమ్మతో రెండు పెయింటింగ్స్‌ను  స్టీవెన్ పంపించారు. ఈ చిత్రాలను చుసిన మోదీ  ‘‘విషయాలను లోతుగా గ్రహించే ప్రతిభ మీకు ఉందని మీ పెయింటింగ్స్ సూచిస్తున్నాయి. సూక్ష్మ భావాలను వ్యక్తం చేసిన తీరు హృదయాన్ని హత్తుకుంది’’ అని  ప్రశంసించారు. 

పైగా,  ప్రస్తుత కష్టకాలంలో ప్రజారోగ్యం, సంక్షేమం గురించి యువ కళాకారుడి అభిప్రాయాలను కూడా ప్రధాన మంత్రి ప్రశంసించారు. “వ్యాక్సిన్ ప్రచారం, క్రమశిక్షణ, 130 కోట్ల మంది భారతీయుల సమిష్టి ప్రయత్నాలతో పాటు మహమ్మారికి వ్యతిరేకంగా మా పోరాటానికి బలాన్ని అందిస్తోంది” అని ప్రధాని వ్రాసారు. 

 కాగా  సానుకూలతను వ్యాప్తి చేయడానికి స్టీవెన్ చేస్తున్న  ప్రయత్నాలతో ప్రజలు స్ఫూర్తి పొందుతారని ప్రధాని  ఆశాభావం వ్యక్తం చేశారు. స్టీవెన్ తన లేఖలో గత 15 సంవత్సరాలుగా పెయింటింగ్ చేస్తున్నానని, వివిధ స్థాయిలలో 100 కి పైగా అవార్డులను గెలుచుకున్నారని ప్రధానికి చెప్పారు.  కరోనావైరస్‌పై పోరాటంలో భారతదేశ టీకా కార్యక్రమాన్ని ఈ సందర్భంగా  ప్రశంసించారు.