50 శాతం మందికి సింగిల్ డోస్ వ్యాక్సిన్

దేశంలో 18 ఏళ్లు పైబడిన వారు సగం మందికి పైగా సింగిల్ డోసు వ్యాక్సిన్ తీసుకున్నట్టు వెల్లడైంది. వీరిలో హెల్త్ కేర్ వర్కర్లు 99 శాతం, ఫ్రంట్ లైన్ వర్కర్లు 100 శాతం ఉన్నారు. 60 ఏళ్లకు పైబడిన వారిలో కనీసం ఒక్క విడత వ్యాక్సిన్ డోస్ అయినా తీసుకున్న వారు 60 శాతం ఉన్నారు. 
 
ప్రస్తుతం 47.3 కోట్ల మంది తొలి డోసు వ్యాక్సిన్ తీసుకోగా, రెండో విడత వ్యాక్సిన్ కూడా తీసుకున్న వాళ్లు 13.8 కోట్లకు చేరారు. కోరనా మూడో దశ రాకుండా నిరోధించే ప్రయత్నాల్లో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసిన నేపథ్యంలో ఈ గణాంకాలను ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయ ఓ ట్వీట్‌లో తెలిపారు. 
 
‘భారత్ మరో గొప్ప మైలురాయిని చేరుకుంది.అర్హులైన వారిలో 50 శాతానికి పైగా ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నారు. కీపిటప్ ఇండియా…కరోనాతో కలిసి పోరాడదాం” అని ఆ ట్వీట్‌లో మంత్రి పేర్కొన్నారు. 
ఆరోగ్య శాఖ డాటా ప్రకారం, వ్యాక్సినేషన్ డ్రైవ్ మూడో దశ ప్రారంభమైనప్పటి నుంచి 18 నుంచి 44 ఏళ్ల లోపు వారు 23,18,95,731 మంది మొదటి డోసు తీసుకోగా, రెండో డోసు కూడా వేయించుకున్న వారు 2,33,74,357 మంది ఉన్నారు. ఈ ఏడాది చివరి కల్లా దేశంలోని అందరికీ వ్యాకినేషన్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కార మార్గం. అందుకే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కోటి మందికి టీకాలు వేశారు. ఒక్క రోజులో అత్యధిక టీకాలు వేయడం ఇదే ప్రథమం. దీంతో దేశవ్యాప్తంగా 62 కోట్ల మందికి టీకాలు వేసినట్లయ్యింది. దేశంలో వ్యాక్సినేషన్ ఉద్యమం జనవరి 16 నుంచి ప్రారంభమయ్యింది.

ఇప్పటివరకూ ఉత్తరప్రదేశ్‌లో 28 లక్షల జనాభాకు టీకాలు వేశారు. తరువాతి స్థానంలో కర్నాటక్ ఉంది. ఇక్కడ ఇప్పటివరకూ 10 లక్షల మందికి టీకాలు వేశారు. కోవిన్ పోర్టల్‌ను అనుసరించి… దేశవ్యాప్తంగా మొత్తం 62 కోట్ల, 17 లక్షల ఆరు వేల 882 మందికి టీకాలు వేశారు. 48 కోట్ల 8 లక్షల 78 వేల 410 మందికి మొదటి డోసు టీకాలు వేయగా, 14 కోట్ల 8 లక్షల 28 వేల 472 మందికి రెండవ డోసు టీకా వేశారు. ఇప్పటివరకూ వ్యాక్సినేషన్ విషయంలో మొదటి స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.