అసోంలో ‘ఉగ్ర’ దాడి.. ఐదుగురు దుర్మరణం

అసోంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గురువారం రాత్రి పలు ట్రక్కులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి తగులబట్టడంతో ఐదుగురు మృతి చెందారు. డిమా హసావో జిల్లాలో ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. 
 
దిమా హసావో జిల్లా దియుంగ్బ్రాలో ఏడు ట్రక్కులకు నిప్పు పెట్టడంతో  ట్రక్కుల్లో ఉన్న ఐదుగురు సజీవ దహనమయ్యారు. మంటల్లో ఐదుగురు కాలి చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ఇది ఉగ్రవాదుల చర్యగా భావిస్తున్నామని, దీనివెనక దిమాసా నేషనల్‌ లిబరేషన్‌ ఆర్మీ (డీఎన్‌ఎల్‌ఏ) హస్తమున్నట్లు అనుమానిస్తున్నామని జిల్లా ఎస్పీ జయంత్‌ సింగ్‌ తెలిపారు. 
 
గురువారం రాత్రి దియుంగ్బ్రాలో ట్రక్‌ డ్రైవర్లు, ఇతరులపై ఆయుధాలతో ఐదుగురు మిలిటెంట్లు కాల్పులు జరిపారని, అనంతరం ఆ ట్రక్కులకు నిప్పంటించారని ఎస్పీ చెప్పారు. ఈ దాడి వెనక డీఎన్‌ఎల్‌ఏ అనే మిలిటెంట్‌ సంస్థ ఉన్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అస్సామ్‌ రైఫిల్స్‌కు చెందిన భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. కాలిపోయిన వాహనాల నుంచి ఐదు మృతదేహాలను వెలికితీశామని పేర్కొన్నారు. 
ఇటుక, బొగ్గు లోడ్‌తో ట్రక్కులు ఉమ్రాంగ్సో నుంచి లంకకు వెళ్లుండగా ఉగ్రవాదులు దారికాచి రాత్రి 8 గంటల ప్రాంతంలో దాడికి దిగాయని, ఉగ్రవాదుల కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. అసోంలోని కొండ ప్రాంతాల్లో దిమా హసానో జిల్లా ఉన్నది. కొన్నేళ్ల క్రితం తీవ్రవాద కార్యకలాపాలకు నెలవుగా ఉన్నది.
అయితే గత ఐదేండ్లుగా అక్కడ స్థబ్దత నెలకొన్నది. కర్బీ అన్‌గ్లాంగ్‌ జిల్లాలో గత మే జరిగిన ఎన్‌కౌంటర్‌లో డీఎన్‌ఎల్‌ఏ ఉగ్రవాదులను భద్రతా బలగాలు తుదముట్టించాయి.  అసోం పోలీసులు, అసోం రైఫిల్స్ జరిపిన ఉగ్రవాద నిరోధక చర్యల్లో డీఎన్ఎల్ఏకు చెందిన ఆరుగురు అగ్రనేతలు హతమయ్యారు.  దీనికి ప్రతీకారంగానే వారు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
డిమస గిరిజనులతో కూడిన సర్వసత్తాక, సతంత్ర దేశం డిమాండ్‌పై 2019లో డీఎన్ఎల్ఏ ఏర్పడింది. అసోలోని డిమా హసావో, కర్బి ఆంగ్లాంగ్, కచర్, నాగోవ్ జిల్లాలతో పాటు నాగాల్యాండ్‌లోని కొన్ని ప్రారాంతాల్లో డిమసా గిరిజనులు ఉన్నారు.