అయోధ్యకు రైలులో రాష్ట్రపతి ప్రయాణం

అయోధ్యకు రైలులో రాష్ట్రపతి ప్రయాణం

రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ మ‌ళ్లీ రైలు ప్రయాణం చేయనున్నారు. ఈసారి ఆయ‌న అయోధ్య సందర్శనకు రైలులో బయలుదేరనున్నారు.  ఆగ‌స్టు 26 నుంచి 29 మ‌ధ్య యూపీలోని ల‌క్నో, గోర‌ఖ్‌పూర్‌, అయోధ్య‌లో రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ ప‌ర్య‌టించ‌నున్నారు.

గత జూన్ లో ఆయన యూపీలోని స్వస్థలంకు రైలులో వెళ్లడం తెలిసిందే.  రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యం ప్రకటన ప్రకారం ల‌క్నో నుంచి ఆగ‌స్టు 29వ తేదీన కోవింద్ అయోధ్య‌కు వెళ్తారు. అక్క‌డ జ‌రుగుతున్న రామాల‌య నిర్మాణ ప‌నుల‌ను ఆయ‌న ప‌ర్య‌వేక్షించ‌నున్న‌ట్లు రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

అయోధ్య రాముడికి రామ్‌నాథ్ పూజ‌లు కూడా నిర్వ‌హించ‌నున్నారు. అక్క‌డ అనేక ప్రాజెక్టుల‌కు ఆయ‌న శంకుస్థాప‌న చేయ‌నున్నారు. తుల‌సి స్మార‌క భ‌వ‌నం, న‌గ‌ర బ‌స్ స్టాండ్‌, అయోధ్య థామ్ నిర్మాణ ప్రాజెక్టుల‌ను ఆయ‌న ప్రారంభించ‌నున్నారు.

ఆగ‌స్టు 26, 27 తేదీల్లో కోవింద్ ల‌క్నోలో ప‌ర్య‌టిస్తారు. రెండు స్నాతకోత్సవాలలో పాల్గొని ప్రసంగిస్తారు. మాజీ సీఎం డాక్ట‌ర్ సంపూర్ణానంద విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తారు. కెప్టెన్ మ‌నోజ్ పాండే సైనిక్ స్కూల్‌లో ఆడిటోరియంను ప్రారంభిస్తారు. ఆగ‌స్టు 28వ తేదీన గోర‌ఖ్‌పూర్‌లోని మ‌హాయోగి గురు గోర‌క్‌నాథ్ ఆయుష్ మ‌హావిద్యాల‌యాన్ని ప్రారంభిస్తారు.