వనరులు అమ్మేసి ముడుపులు తీసుకోంది కాంగ్రెస్ యే!

దేశంలోని వనరులను అమ్మేసి, ముడుపులు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీయేనని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ దుయ్యబట్టారు. నేషనల్ మానెటైజేషన్ పైప్‌లైన్‌పై మోదీ సార‌ధ్యంలోని బీజేపీ ప్ర‌భుత్వం దేశాన్ని అమ్మ‌కానికి పెట్టింద‌ని చేసిన రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆమె ఘాటుగా స్పందించారు. 

మానెటైజేషన్ అంటే ఏమిటో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి తెలుసా? అని ఆమె ప్రశ్నించారు. దేశ వ‌న‌రుల‌ను అయిన‌కాడికి అమ్మేసి అందులో ముడుపులు తీసుకున్న చ‌రిత్ర కాంగ్రెస్‌ద‌ని ఆమె ఆరోపించారు. ‘‘మానెటైజేషన్ అంటే ఏమిటో రాహుల్ గాంధీకి అర్థమవుతుందా? దేశంలోని వనరులను అమ్మేసి, ముడుపులు పుచ్చుకున్నది కాంగ్రెస్ పార్టీయే’’ అని సీతారామన్  ధ్వజమెత్తారు.

2008లో ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేను కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం మానెటైజ్ చేసి రూ.8,000 కోట్లు సేకరించిందని ఆమె గుర్తు చేశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ను లీజుకు ఇవ్వాలనే ప్రతిపాదన చేసినది యూపీయే ప్రభుత్వమేనని ఆమె చెప్పారు. కామన్వెల్త్ గేమ్స్‌ సమయంలో జరిగిన అవినీతిని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు.

మానెటైజేషన్ అంటే ఆస్తులను అమ్మడం కాదని ఆర్ధిక మంత్రి  పునరుద్ఘాటించారు. ఆస్తులను తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తారని ఆమె స్పష్టం చేశారు. ఇవి పూర్తయిన బ్రౌన్‌ఫీల్డ్ అసెట్స్ అని, అయితే వీటి వినియోగం తక్కువగా ఉందని ఆమె తెలిపారు. వీటిని పరిపూర్ణంగా వినియోగంలోకి తేవడం కోసం మానెటైజేషన్ ప్రక్రియను అనుసరిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. నేషనల్ మానెటైజేషన్ పైప్‌లైన్‌లో భాగంగా 25 విమానాశ్రయాలు, 40 రైల్వే స్టేషన్లు, 15 రైల్వే స్టేడియాలు, మరికొన్ని సంస్థల అభివృద్ధికి ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తారు.