ఆఫ్ఘన్ శరణార్ధులతో రష్యాకు ముప్పు వాటిల్లే ప్రమాదం 

ఆఫ్ఘనిస్థాన్ శరణార్థులను మధ్య ఆసియా దేశాలకు తరలిస్తుండడంపై అమెరికా, ‘నాటో’ మిత్రదేశాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర విమర్శలు చేశారు. వారి వల్ల రష్యాకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆసియాలో ఆఫ్ఘన్ వలసదారులకు వీసా రహిత ఆశ్రయం సరికాదని స్పష్టం చేశారు.

ఈ విషయాన్ని తాను సోమవారం జరిగే కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ (సీఎస్‌టీవో) సమ్మిట్‌లో ప్రస్తావిస్తానని తెలిపారు.  కజక్‌స్థాన్ అధ్యక్షుడు కసీం-జోమర్ట్ టోకయెవ్‌తో వర్చవల్ సమావేశంలో మాట్లాడిన పుతిన్ ఆఫ్ఘనిస్థాన్‌లోని ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు.

అమెరికా, యూరప్ దేశాలు ఆఫ్ఘన్ పౌరుల వీసాలను ప్రాసెస్ చేస్తుంటే, పాశ్చాత్య దేశాలు కొన్ని ఆఫ్ఘన్ శరణార్థులను పొరుగున ఉన్న మధ్య ఆసియా దేశాలకు తరలిస్తున్నాయని పుతిన్ మండిపడ్డారు. శరణార్థుల ముసుగులో ఆఫ్ఘనిస్థాన్ ఉగ్రవాదులను తాము కోరుకోవడం లేదని పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే, ఆఫ్ఘన్ శరణార్థుల అంశానికి రష్యా విదేశాంగ శాఖ తొలి ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. మధ్య ఆసియా దేశాలైన ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్, తుర్కెమెనిస్థాన్ వంటివి ఆఫ్ఘనిస్థాన్‌తో సరిహద్దును పంచుకుంటున్నాయి.  ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అక్కడి నుంచి శరణార్థుల ప్రవాహం కొనసాగుతుందని ఆయా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. శరణార్థుల ముసుగులో ఐసిస్ ఉగ్రవాదులు, మత తీవ్రవాదులు, ఛాందసవాదులు దేశంలోకి చొరబడతారని భయపడుతున్నాయి.

తాలిబన్ల పాలనలో తమ భవిష్యత్తు చీకటిమయమవుతుందని భావిస్తున్న అనేక మంది అఫ్ఘానిస్థానీలు మాతృభూమిని వీడి ఇతర దేశాల పంచన చేరుతున్నారు. మరికొందరు మాత్రం తమ సంతానాన్నైనా దేశం నుంచి తరలించాలంటూ అమెరికా భద్రతా దళాలను వేడుకుంటున్నారు. 

కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద ఏర్పాటు చేసిన ఇనుప కంచెలపై నుంచి తమ చిన్నారులను భద్రతాసిబ్బందికి అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో కాబూల్  ఎయిర్ పోర్టు.. హృదయవిదారక దృశ్యాలకు వేదిక అవుతోంది. మరోవైపు.. అఫ్ఘాన్ శరణార్థులను ఆదుకునేందుకు పలు దేశాల ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి.

మాతృభూమిని వీడిన వారికి ఆశ్రయమిచ్చేందుకు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం అమెరికా, కెనడా, బ్రిటన్, భారత్, పాకిస్థాన్, ఇరాన్, ఉబ్జెకిస్థాన్, నార్త్ మాసెడోనియా, ఉగాండా,అల్బేనియా అండ్ కొసోవో, టర్కీ దేశాల ప్రభుత్వాలు అఫ్ఘాన్ శరణార్థులను తమ దేశంలోకి అనుమతిస్తున్నాయి. అయితే అధికశాతం మంది అప్ఘానిస్థానీలు దేశంలోనే మిగిలిపోతున్నారని ఐక్యరాజ్య సమితి తాజాగా పేర్కొంది.  తాలిబన్ల ద్వారా ప్రమాదం ఎదుర్కొంటున్న వారు దేశం విడిచిపెట్టేందుకు సులువైన, స్పష్టమైన మార్గం ఏదీ లేదని కూడా ఆవేదన వ్యక్తం చేసింది.