అనంతపురం నుంచి గుంటూరుకు నాలుగు లైన్ల రహదారి

అనంతపురం నుంచి గుంటూరుకు నాలుగు లైన్ల రహదారి

అనంతపురం నుంచి గుంటూరుకు నాలుగు లైన్ల రహదారిని నిర్మించాలని భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఎఐ) నిర్ణయించింది. మొత్తం 417.91 కిలోమీటర్ల మేర రహదారిని రూ.9 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనుంది. 

ఎపి సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. సిఎం జగన్‌ ప్రతిపాదనల మేరకు ‘ఎన్‌హెచ్‌ 544డి’ నిర్మించేందుకు కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆమోదం తెలిపింది. గతంలో అనంతపురం నుంచి గుంటూరు వరకు ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి టిడిపి ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు వచ్చాయి. 

అయితే, ఈ రహదారి కోసం భారీగా అటవీ భూములను సేకరించాల్సి ఉంది. ఒకవేళ అటవీ భూములను సేకరిస్తే అంతకు రెట్టింపు భూములను అటవీశాఖకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉంటుంది. అటవీ భూముల కేటాయింపునకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు ఇచ్చేందుకు 2018లోనే నిరాకరించడంతో ఎక్స్‌ప్రెస్‌ హైవే ప్రతిపాదనలు ఆగిపోయాయి.

ఈ క్రమంలో 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం అనంతపురం-గుంటూరు రహదారి కోసం ప్రత్యామ్నాయ మార్గాలతో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖకు మరోసారి ప్రతిపాదనలు పంపింది. అనంతపురం నుంచి కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలోని ప్రధాన పట్టణాలను అనుసంధానిస్తూ ప్రణాళిక సిద్ధం చేసింది. 

ఇప్పటికే ప్రభుత్వం ప్రకాశం జిల్లా గిద్దలూరు, గుంటూరు జిల్లా వినుకొండ మధ్య రహదారి నిర్మాణ పనులను ప్రారంభించింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ అనంతపురం-గుంటూరు మధ్య నాలుగు లైన్ల రహదారి నిర్మించాలని పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.

417.91 కిలోమీటర్లు.. 4 ప్యాకేజీలు..!
అనంతపురం నుంచి గుంటూరుకు మొత్తం 417.91 కిలోమీటర్ల ఈ రహదారిని రూ.9 వేల కోట్లతో నాలుగు ప్యాకేజీల కింద నిర్మించాలని నిర్ణయించారు.

1. అనంతపురం నుంచి బుగ్గ వరకు 69 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తారు. ఇప్పటికే అనంతపురం నుంచి తాడిపత్రి వరకు నాలుగు లేన్ల రహదారి ఉంది. తాడిపత్రి నుంచి బుగ్గ వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణం కోసం భూసేకరణ పూర్తిచేశారు. త్వరలో టెండర్ల ప్రక్రియ చేపడతారు. అందుకోసం రూ.2,130 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలను ఆమోదించారు.

2. బుగ్గ నుంచి కర్నూలు జిల్లా మీదుగా ప్రకాశం జిల్లా గిద్దలూరు వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తారు. అందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపొందిస్తున్నారు. 154.91 కిలోమీటర్ల మేర ఈ రహదారిని రూ.4,550 కోట్లతో నిర్మిస్తారు.

3. గిద్దలూరు నుంచి గుంటూరు జిల్లా వినుకొండ వరకు పేవర్డ్‌ సోల్డర్స్‌తో రెండు లేన్ల రహదారి నిర్మాణాన్ని ఇప్పటికే వేగంగా కొనసాగిస్తున్నారు. 112 కిలోమీటర్ల మేర ఈ రహదారి కోసం రూ.845 కోట్లతో ప్రతిపాదనలు ఆమోదించారు. అందులో 108.37 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి గత డిసెంబరు 25వ తేదినే పిసిసి జారీచేశారు.

4. వినుకొండ నుంచి గుంటూరు వరకు 82 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తారు. అందుకోసం రూ.1,475 కోట్లతో ప్రతిపాదనలను ఆమోదించారు. దీనిపై డిపిఆర్‌ను రూపొందిస్తున్నారు. ఆ తరువాత టెండర్ల ప్రక్రియ చేపడతారు.