జన ఆశీర్వాద్‌ యాత్రతో టీఆర్‌ఎస్‌లో భయం

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నిర్వహించిన జన ఆశీర్వాద్‌ యాత్రకు అపూర్వ స్పందన లభించిందని, దీంతో టీఆర్‌ఎ్‌సలో భయం మొదలై పలుచోట్ల అడ్డుకునేందుకు ప్రయత్నించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. వ్యాక్సిన్‌ అంటే మోదీ, మోదీ అంటే వ్యాక్సిన్‌ అని, వ్యాక్సినేషన్‌ను రాజకీయ కోణంలో చూస్తూ సీఎం కేసీఆర్‌ భయపడుతున్నారని ధ్వజమెత్తారు. 

అందుకే, టీకా వేసుకోవాలని రాష్ట్ర ప్రజలకు ఇప్పటివరకు పిలుపు ఇవ్వలేదని విమర్శించారు. యాత్ర ముగింపు సందర్భంగా శనివారం రాత్రి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో కిషన్‌రెడ్డిని నాయకులు ఘనంగా సన్మానించారు. కేబినెట్‌ మంత్రిగా తొలిసారి కార్యాలయానికి వచ్చిన ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ, రారా.. పోరా.. అని కిషన్‌రెడ్డితో ఆప్యాయంగా పిలిపించుకునే కార్యకర్తను తాను మాత్రమేనని భావోద్వేగంతో చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలే ఇవ్వలేని సీఎం కేసీఆర్‌, దళితబంధు ఎలా అమలు చేస్తారని నిలదీశారు. రాష్ట్రంలో బీజేపీకి ప్రజల నిండైన ఆశీర్వాదం ఉందని, ప్రధాని మోదీపై ఉన్న విశ్వాసాన్ని ఇది చాటుతోందని పేర్కొన్నారు.

హోం మంత్రి అమిత్‌షా సహాయకుడిగానే ఉంటానని, కేబినెట్‌ ర్యాంకు వద్దని కిషన్‌రెడ్డి చెప్పినా ప్రధాని మోదీ పట్టుబట్టి పదవి ఇచ్చారని వివరించారు. ఇంద్రసేనారెడ్డి, మురళీధర్‌రావు, దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావు వంటి సీనియర్‌ నాయకులు ఒకప్పుడు సామాన్య కార్యకర్తలే అని, నమ్మిన సిద్ధాంతం కోసం వారు ఎన్నో దాడులను ఎదుర్కొన్నారని సంజయ్‌ చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని సర్వనాశనం చేసిందని,కేంద్ర మంత్రులను పార్లమెంటుకు పరిచయం చేయకుండా అడ్డుకున్న దుర్మార్గపు పార్టీ అని దుయ్యబట్టారు. కేసీఆర్‌ది నియంత, నికృష్ట పాలన అని జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ప్రధాని మోదీ లక్ష్యం.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటని.. ఇందుకోసం రాష్ట్ర ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని ఆమె చెప్పారు.