కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఏడుగురు మృతి

కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఏడుగురు మృతి
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు చనిపోయారు. మృతులంతా ఆఫ్ఘన్ పౌరులే. దేశం విడిచి వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్దకు చేరుకున్న ఆఫ్ఘన్ పౌరులను చెదరగొట్టేందుకు తాలిబన్లు కాల్పులు జరిపారు. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు అంతా పరుగులు తీశారు. ఆ సమయంలో తొక్కిసలాట ఏర్పడింది. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
గత వారం రోజులలో కాబుల్ ఎయిర్ పోర్ట్ పరిసరాలలో ఆఫ్ఘన్ నుండి వెళ్లిపోవాలని వత్తిడిలో కనీసం 20 మంది మృతి చెందారని నాటో దౌత్యవేత్త ఒకరు తెలిపారు. 
2001 నుంచి ఉన్న అమెరికా బలగాలు వెళ్లిపోవడంతో తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను సునాయాసంగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. షరియా ప్రకారం పాలన ఉంటుందని ప్రకటించారు. స్వేచ్ఛ కల్పిస్తామని నమ్మబలుకుతూనే తమ నిజస్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టారు. బాలికలను ఎత్తుకుపోవడమేకాక సెక్స్ బానిసలుగా మారుస్తున్నారు. ఉద్యోగాలు చేయడానికి వీల్లేదంటూ మహిళలపై తీవ్ర ఆంక్షలు విధిస్తున్నారు. దాడులకు కూడా పాల్పడుతున్నారు.

తాలిబన్ల అరాచకాలు తట్టుకోలేక ప్రజలు పెద్ద సంఖ్యలో దేశం విడిచిపోయేందుకు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటున్నారు. దీంతో విమానాశ్రయం వద్ద రద్దీ తీవ్రమైంది. దేశం విడిచి వెళ్లకుండా అడ్డుకునేందుకు తాలిబన్లు పౌరులపై కాల్పులకు తెగబడుతున్నారు. మరోవైపు తాలిబన్ల చెర నుంచి ఆఫ్ఘన్‌కు విముక్తి కల్పించాలంటూ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి.

ఆఫ్ఘన్ కు విమానాలు నిలిపివేసిన పాక్ 

ఆఫ్ఘ‌నిస్థాన్‌కు తాత్కాలికంగా విమాన రాక‌పోక‌ల‌ను పాకిస్థాన్ నిలిపేసింది. ప్ర‌స్తుతానికి అక్క‌డి వాళ్ల‌ను త‌ర‌లించే ప్ర‌క్రియ‌ను ఆపేసింది. పాకిస్థాన్ ఇంట‌ర్నేష‌న్ ఎయిర్‌లైన్స్ గ‌త కొన్ని రోజులుగా కాబూల్‌లో చిక్కుకుపోయిన దౌత్య‌వేత్త‌లు, విదేశీయుల‌ను అక్క‌డి నుంచి త‌ర‌లిస్తూ వ‌స్తోంది. 

అయితే కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో స‌రైన వ‌స‌తులు లేక‌పోవ‌డం, ర‌న్‌వేపై భారీ ఎత్తున చెత్త పేరుకుపోవ‌డం వ‌ల్ల తాత్కాలికంగా త‌మ విమానాల‌ను నిలిపేస్తున్న‌ట్లు పీఐఏ తెలిపింది. కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో అస‌లు భ‌ద్ర‌తా సిబ్బంది, ఇమ్మిగ్రేష‌న్ సిబ్బంది కూడా లేర‌ని ఆ ఎయిర్‌లైన్స్ వ‌ర్గాలు తెలిపాయి. 

ఇప్ప‌టి వ‌ర‌కూ ఐదు విమానాల్లో మొత్తం 1500 మంది జ‌ర్న‌లిస్టులు, యూఎన్ అధికారులు, పాకిస్థాన్ జాతీయుల‌ను త‌ర‌లించిన‌ట్లు పీఐఏ తెలిపింది.