గాంధీ ఆస్పత్రి ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్‌ సీరియస్‌

గాంధీ ఆస్పత్రి ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్‌ సీరియస్‌

తెలంగాణలోని గాంధీ ఆస్పత్రిలో  ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిగిన ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్‌ సీరియస్‌ అయింది. బాధితుల ఫిర్యాదు మేరకు వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ సీఎస్‌, డీజీపీ, హోంశాఖ కార్యదర్శి, ఆరోగ్యశాఖ కార్యదర్శికి కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ అరుణ్‌ హల్దాల్‌ నోటీసులు జారీ చేశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన ఒక వ్యక్తి రెండు కిడ్నీలూ పాడైపోవడంతో ఈ నెల 4న ఆయన్ను గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. అతడికి సహాయకులుగా అతడి భార్య, మరదలు ఆస్పత్రిలో ఉన్నారు.

గాంధీ ఆస్పత్రిలో రేడియాలజీ విభాగంలో డార్క్‌రూమ్‌ అసిస్టెంట్‌గా పనిచేసే ఉమామహేశ్వర్‌ అనే వ్యక్తి వారికి బంధువు. అతడి సహకారంతోనే ఆమె తన భర్తను గాంధీ ఆస్పత్రిలో చేర్చింది. ఏడో తేదీ నుంచి ఆమె, ఆమె చెల్లెలు ఇద్దరూ పేషెంట్‌ వద్దకు వెళ్లలేదు. పేషెంట్‌ కుమారుడు ఈ నెల 9వ తేదీన.. తన తండ్రి వద్దకు వచ్చాడు.

తల్లి, పిన్ని 7వ తేదీ నుంచి తండ్రి వద్దకు రావట్లేదని అతడికి తెలిసింది. వారి కోసం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో 11వ తేదీన అతడు తన తండ్రిని ఇంటికి తీసుకెళ్లాడు. ఎట్టకేలకు ఆదివారంనాడు ఉమామహేశ్వర్‌ అతడికి ఫోన్‌ చేసి.. ‘‘ఆస్పత్రి వెనుక భాగంలో ఖాళీ ప్రదేశంలో దుస్తులు లేని స్థితిలో మీ పిన్ని ఉంది’’ అని చెప్పడంతో వెంటనే అక్కడికి చేరుకున్నాడు.

అక్కడ తుప్పల్లో అపస్మారక స్థితిలో ఉన్న పిన్నికి సపర్యలు చేసి ప్రశ్నించగా.. తనపై జరిగిన అఘాయిత్యం గురించి తెలిపిందని అతడు వివరించాడు. కాగా.. ఇప్పటికీ రెండవ బాధితురాలి ఆచూకీ లభ్యం కాకపోవడం గమనార్హం.

మల్కాజ్‌గిరి ఘటనపై ఆగ్రహం 

మరోవంక, మల్కాజ్‌గిరి ఘటనపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన అనుచరులు దళిత మహిళలను కులం పేరుతో దూషించారని, అంబేద్కర్‌ ఫోటోను కాళ్లతో తన్ని అవమానించారని  కమిషన్‌కు దళిత నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మల్కాజ్‌గిరిలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు అరుణ్ హల్ధర్ బాధితురాలని విచారించారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితులను తీవ్ర పదజాలంతో దూషించిన విషయం తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కొంతమంది అధికారులు నిందితులను రక్షించడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ ఘటనపై కమిషన్ తీవ్రంగా దృష్టి సారించిందని తెలిపారు. 

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రమైన అంశమని, నిందితులు ఎంతటివారైనా సరే 24 గంటల్లో అరెస్ట్ చేయాలని ఆదేశించారు. నిందితులను అరెస్ట్ చేయకపోతే పోలీసులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని అరుణ్ హల్ధర్ పేర్కొన్నారు.