ఆఫ్ఘన్ పరిణామాలపై ప్రపంచ దేశాల ఆందోళన!

ఆఫ్ఘన్ పరిణామాలపై ప్రపంచ దేశాల ఆందోళన!

ఆఫ్ఘనిస్థాన్‌లో తాజా ప‌రిణామాల‌పై ఐక్య‌రాజ్య‌స‌మితితో పాటు పలు ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బ‌ల‌ప్ర‌యోగంతో అధికారం చేజిక్కించుకోవ‌డం అంత‌ర్యుద్ధానికి దారితీస్తుంద‌ని ఐరాస ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆంటోనియో గుటెర‌స్ హెచ్చరించారు.  తాలిబ‌న్‌లు దేశాన్ని హ‌స్త‌గ‌తం చేసుకోవ‌డంపై ప్రపంచ దేశాలు కూడా స్పందిస్తున్నాయి.

కాగా, ఆఫ్ఘ‌నిస్థాన్‌ లో ప్ర‌స్తుత ప‌రిస్థితికి అమెరికానే కార‌ణ‌మని జ‌ర్మ‌నీ విమ‌ర్శించింది. ఆ దేశం నుంచి బ‌ల‌గాల‌ను ఉప‌సంహ‌రించుకోవ‌డంలో కొంత అమెరికా దేశీయ రాజ‌కీయాల పాత్ర కూడా ఉన్న‌ద‌ని జ‌ర్మ‌నీ చాన్స్‌ల‌ర్ ఏంజెలా మెర్కెల్ ఆరోపించారు. అగ్ర‌రాజ్యం బ‌ల‌గాల‌ను వెన‌క్కి తీసుకెళ్ల‌డం వ‌ల్లే ఆఫ్ఘ‌నిస్థాన్ తాలిబ‌న్ల చేతుల్లోకి వెళ్లిందని ఆమె స్పష్టం చేశారు. 

మ‌రోవైపు ఆఫ్ఘ‌నిస్థాన్‌లో చిక్కుకుపోయిన 10 వేల మందిని త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేయ‌నున్న‌ట్లు మెర్కెల్ చెప్పారు. వీళ్ల‌లో 2500 మంది ఆఫ్ఘ‌న్ స‌పోర్ట్ స్టాఫ్ కాగా.. హ‌క్కుల కార్య‌క‌ర్త‌లు, లాయ‌ర్లు, ఇత‌రులు ఉన్నారు. ఆఫ్ఘ‌నిస్థాన్‌లో సంక్షోభ ప‌రిస్థితుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నామ‌ని బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌ చెప్పారు.

కాబూల్‌లో భారత్‌ నిర్మించిన ఆఫ్ఘన్‌ పార్లమెంట్‌ భవనాన్ని సాయుధ తాలిబన్లు సోమవారం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. స్పీకర్‌ చైర్‌లో ఒక తాలిబన్‌ కూర్చొని టేబుల్‌పై తుపాకీని ఉంచాడు. అధ్యక్షుడితోపాటు ఇతర ప్రముఖులు ఆశీనులయ్యే స్థానాల్లో మరి కొందరు సాయుధ తాలిబన్లు కూర్చున్నారు. పార్లమెంట్‌ లోపల ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌ జాతీయ జెండాను తొలగించారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం వదిలి వెళ్ళిపోతూ తన వెంట నాలుగు కార్లు, పెద్ద హెలికాఫ్టర్ నిండా నోట్ల కట్టలు తీసుకుని దేశం నుంచి పారిపోయారని రష్యా వార్తాసంస్థ ప్రచురించింది. కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం ఈ విషయాల్ని వెల్లడించినట్టు పేర్కొంది. హెలికాఫ్టర్‌లో జాగా సరిపోకపోవడంతో కొంత డబ్బును అఫ్ఘానిస్థాన్‌లోనే విడిచిపెట్టాల్సి వచ్చిందని కూడా పేర్కొంది.

మ‌రోవైపు కాబూల్‌ ఎయిర్‌ పోర్టు నుంచి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, రక్షణ విమానాల కార్యకలాపాలు కొనసాగుతాయని నాటో అధికారులు ప్రకటించారు. అదేవిధంగా తాలిబ‌న్‌ల‌ భయంతో దేశం వీడుతున్న ఆఫ్ఘన్ల సంఖ్య క్రమంగా పెరుగుతున్న‌ది. దీంతో సరిహద్దులు దాటి వస్తున్న శరణార్థులను అడ్డుకునేందుకు టర్కీ, ఇరాన్ చర్యలు చేపట్టాయి. భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులను చక్కదిద్దేందుకు పాకిస్థాన్‌తో కలిపి పని చేస్తామని టర్కీ ప్రకటించింది.

అఫ్ఘానిస్థాన్‌కు చెందని ఓ మిలిటరీ విమానం ఉజ్బెకిస్థాన్‌లో సోమవారం నాడు కూలిపోయింది. అంతకుమనుపే.. పైలట్ విమానం నుంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ క్రమంలో అతడు గాయపడ్డాడని తెలుస్తోంది. అనుమతి లేకుండా ఆ విమానం తమ దేశంలోకి ప్రవేశించిందని ఉజ్బెకిస్థాన్ అధికారులు తెలిపారు.