`సుప్రీం’ ఆదేశం బేతఖార్… కాకాణిపై కేసుల ఎత్తివేత!

ఉన్నత న్యాయస్థానాల నుండి ఎన్నిసార్లు మొట్టికాయలు ఎదురైనా వాటి ఆదేశాలను, తీర్పులను ఖాతరు చేయకపోవడం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరుగా మారింది. తాజాగా,  సుప్రీం కోర్ట్ లేదా హై కోర్టు అనుమతి లేకుండా దేశంలో ఎంపీ/ ఎమ్మెల్యేలపై ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరిచరాదని లేదా వారిపై కేసులను ఎత్తివేయరాదని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించి రెండు రోజులు కూడా గడవక ముందు ఏపీ ప్రభుత్వం ఆ ఆదేశాన్ని దిక్కరించింది.
నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డిపై నమోదైన కేసులను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఆయనపై నమోదైన నకిలీ పత్రాలు, పరువునష్టం కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. మాజీమంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి మలేసియా, హాంకాంగ్‌, సింగపూర్‌ వంటి దేశాల్లో రూ.1,000కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయంటూ 2016లో గతంలో కాకాణి సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి పలు పత్రాలు విడుదల చేశారు.
అయితే తనపై కాకాణి అసత్య ఆరోపణలు చేస్తున్నారని, నకిలీ పత్రాలతో కుట్రలు పన్నుతున్నారని రూరల్‌ పోలీసుస్టేషన్‌లో సోమిరెడ్డి ఫిర్యాదుచేశారు. కేసు విచారణ ప్రారంభించిన పోలీసులు  కాకాణి విడుదల చేసిన పత్రాలు నకిలీవని తేల్చారు. వాటిని తయారుచేసిన చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురిని అరెస్టుచేశారు.
ఆ సమయంలో కాకాణి కొన్నిరోజులపాటు అదృశ్యమయ్యారు. ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా జిల్లాకోర్టులో తిరస్కరించారు. అనంతరం కాకాణి హైకోర్టును ఆశ్రయించి షరతులతో కూడిన బెయిల్‌ను తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు నెల్లూరు జిల్లా 4వ అదనపు జడ్జి కోర్టులో ఉంది. ఇప్పుడు ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై సోమిరెడ్డి హైకోర్టును ఆశ్రయించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.