వినుకొండ బిజెపి నేతపై హత్యా యత్నం

వినుకొండ బిజెపి నేతపై హత్యా యత్నం

గుంటూరు జిల్లాలోని వినుకొండ పట్టణ బీజేపీ అధ్యక్షుడు మేడం రమేష్‌పై హత్యాయత్నం జరిగింది. శుక్రవారం నాడు మార్నింగ్ వాకింగ్‌కు వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను అడ్డుకుని దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఆయనకు చేయి విరిగింది. తలకు కూడా తీవ్ర గాయలయ్యాయి. 

సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రమేష్ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. ఈ దాడి చేయించింది మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అని రమేష్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సురేష్ మహాల్ రోడ్డులో ఆక్రమణ తొలగింపులో శివాలయం కూల్చివేయడం జరిగింది. ఈ శివాలయం కూల్చివేతపై రమేష్ న్యాయపోరాటం చేశారు. ఈ క్రమంలో మున్సిపల్ కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో పగ పెంచుకున్న కమిషనర్ ఇలా రమేష్‌పై హత్యయత్నం చేశారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కాగా ఇవాళ జరిగిన ఈ ఘటనతో మరోసారి సురేష్ మహల్ రోడ్డు విస్తరణ పనుల వివాదం తెరపైకి వచ్చింది. అయితే విస్తరణలో భాగంగా శివాలయాన్ని తొలగించినట్లు మున్సిపల్ అధికారులు అప్పట్లో చెప్పారు. శివాలయం తొలగింపుపై బీజేపీ, జనసేన కలిసి న్యాయపోరాటం చేశాయి. 

ఈ క్రమంలో వినుకొండ కమీషనర్ శ్రీనివాస్‌పై చర్యలు తీసువాలని ఉన్నతాధికారులకు బీజేపీ నేత రమేష్ ఫిర్యాదు చేశారు. హైకోర్టు జోక్యంతో మధ్యలోనే విస్తరణ పనులు ఆగిపోయాయి. ఈ క్రమంలోనే తనపై దాడి జరిగిందని రమేష్ చెబుతున్నారు. మొత్తానికి చూస్తే.. ఈ రోడ్డు విస్తరణ పనుల వివాదం చినికి చినికి గాలి వానలా మారింది. 

సోము వీర్రాజు ఖండన 
 మేడం రమేష్ పై నేటి ఉదయం కొందరు కర్రలతో దాడి చేయడాన్ని ఏపీ బిజెపి అధ్యక్షులు సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో భౌతిక దాడులు, హత్యాయత్నాలు,ద్వారా భయపెట్టాలనుకోవడం సరికాదని హితవు చెప్పారు.
ప్రజాసమస్యలపై నిరంతర అధికారులను, అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్న మేడం రమేష్ పై, వ్యక్తిగతంగా కక్షగట్టి దాడులతో బయపెట్టాలి అనుకోవటం ఆవివేకమైన చర్యగా సోము వీర్రాజు అభివర్ణించారు. నరసరావుపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షుడుని సత్వరమే వినుకొండ వెళ్లి,సమగ్ర సమాచారం సేకరించాలని, రమేష్’ కు అవసరమైన మెరుగైన వైద్య సేవలు అందించాలని సోము వీర్రాజు ఆదేశించారు.
రాష్ట్రంలో పార్టీ శ్రేణులను రక్షించుకునేందుకు అవసరమైతే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని వీర్రాజు స్పష్టం చేశారు. వెంటనే జిల్లా యస్పీ ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.