ఓబీసీ బిల్లుకు లోక్‌సభ ఏకగ్రీవ ఆమోదం

రాష్ట్రాలకు తమ సొంత ఓబీసీ జాబితాలను రూపొందించుకునే అధికారాన్ని పునరుద్ధరించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. బిల్లుకు మద్దతుగా 385 మంది సభ్యులు ఓటేయగా ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. అయితే రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించాలని, కుల ఆధారిత జనగణనను నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. 

రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉండటంతో రిజర్వేషన్లపై డిమాండ్‌ను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉందని సామాజిక న్యాయం, సాధికారిత మంత్రి వీరేంద్రకుమార్‌ బదులిచ్చారు. ఓబీసీ బిల్లు రాజ్యసభలోనూ ఆమోదం పొందితే రాష్ట్రాలు సొంతంగా ఓబీసీ జాబితాను రూపొందించుకునేందుకు వీలవుతుంది. ఈ 127 రాజ్యాంగ సవరణ బిల్లు చరిత్రాత్మకమైనదని దీనివల్ల దేశంలో 671 కులాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు.

చర్చ సందర్భంగా కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ బిల్లుకు మద్దతు తెలిపాయి. కాగా ఈ 127వ రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో ప్రతిపక్షాలు ఇంతకు ముందే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టే బిల్లుపై చర్చ జరిగే సమయంలో ఎలాంటి ఆందోళన జరపకుండా చర్చలో పాల్గొన్నాయి. అలాగే తాము ఒబిసి బిల్లుకు మద్దతు ఇస్తున్నామని కాంగ్రెస్ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌధురి వెల్లడించారు.

పెగాసస్‌ గూఢచర్యం, వివాదాస్పద సాగు చట్టాలపై వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పార్లమెంటును స్తంభింపజేస్తున్న విపక్షాలు… లోక్‌సభలో ఓబీసీ బిల్లు ఆమోదం పొందేందుకు మాత్రం సహకరించాయి. మరోవైపు, జాతీయ హోమియోపతి కమిషన్‌ సవరణ బిల్లు, జాతీయ వైద్య విధాన సవరణ బిల్లులను విపక్షాల నిరసన మధ్యే లోక్‌సభ ఆమోదించింది.

రాజ్యసభలో గందరగోళం 

అయితే, రాజ్యసభలో మంగళవారం ప్రతిపక్షాల సభ్యులు గందరగోళం సృష్టించారు. అధికారుల టేబుళ్లపైకి ఎక్కారు. ఫైళ్లను విసిరికొట్టారు. వివాదాస్పద సాగు చట్టాలపై చర్చను ప్రారంభించగానే కాంగ్రెస్‌, టీఎంసీతో పాటు ప్రతిపక్షాల సభ్యులు సభ వెల్‌లోకి వచ్చారు. సాగు చట్టాలను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. 

ఈ సమయంలో కొందరు సభ్యులు పార్లమెంటు సిబ్బంది ముందు ఉండే టేబుళ్లపైకి ఎక్కారు. పలువురు గంటన్నరపాటు అక్కడే బైఠాయించగా మిగతావారు చుట్టూ చేరారు. చైర్మన్‌ స్థానానికి దిగువన ఉండే టేబుల్‌పైకి ఎక్కిన ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ను మార్షల్స్‌ బలవంతంగా కిందకు దింపారు. 

అధ్యక్ష స్థానంపైకి కాంగ్రెస్‌ సభ్యుడు ప్రతాప్‌ సింగ్‌ బజ్వా ఫైల్‌ను విసిరేశారు. టీఎంసీ, డీఎంకే సభ్యులు నలుపు అంగీలు, కుర్తాలు, చీరలు ధరించి వచ్చారు. కాంగ్రెస్‌ సభ్యులు నలుపు హెడ్‌బ్యాండ్లను పెట్టుకున్నారు. కొందరు నలుపు నెహ్రూ జాకెట్లు, నలుపు శాలువాలు, నలుపు మాస్కులతో వచ్చారు.