ఎన్‌ఎస్‌ఒ గ్రూపుతో ఎలాంటి లావాదేవీలు జరపలేదు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్న పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది. ఆ స్పైవేర్ తయారీ సంస్థ ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూపుతో తాము ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని రక్షణ మంత్రిత్వ శాఖ రాజ్యసభలో కీలక ప్రకటన చేసింది. 

ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ టెక్నాలజీస్‌తో రక్షణ శాఖకకు ఏవైనా లావాదేవీలున్నాయా? అని సిపిఎం ఎంపి డాక్టర్ వి శివదాసన్ రాజ్యసభలో ప్రశ్నించారు. ఒక వేళ ఉంటే వాటి వివరాలు చెప్పాలని కోరారు. దీనిపై రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ‘ఎన్‌ఎస్‌ఓ గ్రూపుతో రక్షణ శాఖ ఎలాంటి లావాదేవీలుజరపలేదు’ అని ఆయన స్పష్టం చేశారు.

ఈ సంస్థ అభివృద్ధి చేసిన పెగాసస్ స్పైవేర్‌తో పలు దేశాలు ప్రముఖులఫోన్లపై నిఘా పెట్టినట్లు ఇటీవల సంచలన కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ స్పైవేర్ లక్షిత జాబితాలో భారత్‌కు చెందిన దాదాపు 300 మంది ఉన్నట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. వీరిలో పలువురు రాజకీయ ప్రముఖులు, సిబిఐ అధికారులు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల ఫోన్లను హ్యాక్ చేసినట్లు కథనాలు వచ్చాయి. 

సరిగ్గా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక రోజు ముందు అంటే జులై 18న ఈ కథనాలు వెలువడడంతో కేవలం ఉద్దేశ్యపూర్వకంగానే, దురుద్దేశ్యంతో అటువంటి కధనాలు వెలువడినట్లు ప్రభుత్వం కొట్టిపారవేసింది. అయితే ఈ అంశంపై చర్చకు పట్టుబడుతూ ప్రతిపక్షాలు పార్లమెంటు ఉభయ సభల్లో ఆందోళన చేస్తున్నాయి. 

ఈ క్రమంలో పార్లమెంటు ఉభయ సభల్లో చర్చకు ఆస్కారం లేకుండా వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ వ్యవహారం సర్వోన్నత నాయయస్థానం సుప్రీంకోర్టుకు కూడా చేరింది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. 

భారత ప్రజాస్వామ్యానికి చెడ్డపేరు తేవడమే లక్షంగా కొందరు ఉద్దేశపూర్వకంగా చేసిన ఆరోపణలేనని కేంద్ర ఐటిశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ధ్వజమెత్తారు. భారత్‌లో అనధికారిక నిఘా సాధ్యం కాదని, ఇక్కడ చట్టాలు చాలా పటిష్టంగా ఉన్నాయని పేర్కొ ]న్నారు. అయితే ప్రతిపక్షాల మాత్రం దీనిపై స్వతంత్ర దర్యాప్తుకు పట్టుబడుతున్నాయి.