మహారాష్ట్రలో ప్రమాదంలో హిందూమతం

మహారాష్ట్రలో హిందూ మతం ప్రమాదంలో పడిందని, క్రమంగా రాష్ట్రంలో  హిందూ పండుగులను  తెరమరుగు చేస్తున్నారని బిజెపి ఎమ్యెల్యే  నితీష్ రాణే ఆందోళన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం వరకూ ఇతర మతాల ఉత్సవాలు జరిగాయని, వాళ్లకు అప్పుడు ఎలాంటి ఇబ్బందీ అనిపించలేదని, కానీ హిందువులకే ఆంక్షలెందుకు? అని ప్రశ్నించారు.

కోవిడ్ పేరుతో మహారాష్ట్రంలోని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలు గణేష్ ఉత్సవాలు కోలాహలంగా జరుపుకొనేందుకు వీలులేకుండా ఉన్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్‌లో దుర్గాపూజకు ఎలాటి ఆంక్షలు విధించారో అలాంటి పరిస్థితే మహారాష్ట్రలో థాకరే సారథ్యంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కల్పిస్తోందని ఆయన విమర్శించారు. 

రాష్ట్ర ప్రభుత్వ కొత్త రూల్స్ ప్రకారం గణేష్ మండపాటలలో ఉత్సవాలు జరుపుకోవడం చాలా కష్టమని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని తాము గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. గణపతి ఉత్సవాలకు సంబంధించిన నిబంధనలను గత జూన్‌లో మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

ఉత్సవాల నిర్వాహకులు బహిరంగ ప్రాంతాల్లో 4 అడుగులు మించకుండా, ఇళ్లలో 2 అడుగులు మించకుండా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని నిబంధన విధించింది. మండపాల్లో పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించాలని, పబ్లిక్ మండపాలకు మునిసిపల్ కార్పొరేషన్స్, లోకల్ అడ్మినిస్ట్రేషన్ వద్ద అనుమతి తీసుకోవాలని, ఉత్సవ ప్రాంతాల్లో భజనలు, కీర్తనలు, ఇతర సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, భారీ డెకరేషన్లు వద్దని నిబంధనల్లో ప్రభుత్వం పేర్కొంది.