
దేశంలో కరోనా టీకా 50 కోట్ల మైలురాయిని చేరింది. శుక్రవారం సాయంత్రం ఏడు గంటల సమయానికి అందిన ప్రొవిజనల్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 50,03,48,866 మంది ప్రజలు కరోనా టీకా పొందారు. మరోవైపు శుక్రవారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా 43,29,673 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు వెల్లడించింది. వ్యాక్సినేషన్ 50 కోట్ల మైలురాయిని దాటడంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ హర్షం వ్యక్తం చేసింది.
కాగా, ఈ నెల 2వ తేదీ వరకు 3.56కోట్ల కొవిడ్ టీకా మోతాదులను ప్రైవేటు ఆసుపత్రులు కొనుగోలు చేశాయని, ఒకసారి అవి సేకరించిన మోతాదులను ప్రభుత్వ టీకా కేంద్రాలకు తిరిగి కేటాయించడం లేదని కేంద్రం తెలిపింది. ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్‌కుమార్ లోక్‌సభలో ఎంపీ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం అందించారు. ప్రైవేటు ఆసుపత్రుల నుంచి కొవిడ్ వ్యాక్సిన్ల డిమాండ్‌ను కొవిన్ పోర్టల్‌లో సమీకరించామని పేర్కొన్నారు.
ప్రైవేటు ఆసుప్రతులు టీకాల లభ్యతకు అనుగుణంగా కోవిన్ పోర్టల్‌లో వ్యాక్సినేషన్ షెడ్యూల్‌ను తయారు చేసి, ప్రచురించాయని పేర్కొన్నారు. ఈ నెల 2వ తేదీ నాటికి మొత్తం 3.56 కోట్ల మోతాదులను సేకరించాయని, అవి సేకరించిన టీకాలను తిరిగి ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాలకు కేటాయించరని స్పష్టం చేశారు. జనవరి నుంచి 75, 25 ఫార్ములా కింద ప్రభుత్వ కేంద్రాలు, ప్రైవేటు ఆసుపత్రులకు విడుదల చేసిన కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
ప్రైవేటు ఆసుపత్రులు నెలవారీ కోటాను పూర్తిగా ఉపయోగించుకోలేకపోతే.. వినియోగించని టీకా కోటాను రాష్ట్రాల్లోని ప్రభుత్వ టీకా కేంద్రాలకు తిరిగి కేటాయించాలని సూచిస్తున్నారా? అని ఓ ఎంపీ కేంద్రాన్ని ప్రశ్నించారు. మే ఒకటి నుంచి జూన్ 20 వరకు టీకా తయారీదారులు, కొత్త కొవిడ్ వ్యాక్సిన్ల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు సరళీకృత ధర, వేగవంతమైన జాతీయ కొవిడ్-19 టీకా వ్యూహం అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్