సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కోర్టు ధిక్కరణ కేసులకు 58 కోట్లా?

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌పై దాఖలైన కోర్టు ధిక్కార కేసుల్ని వాదించేందుకు రూ.58 కోట్లు మంజూరు చేశారా? అని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంత భారీ మొత్తాన్ని విడుదల చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని నిలదీసింది. 
 
అసలు అంత మొత్తం ట్రెజరీ నిబంధనల ప్రకారం విడుదలకు వీలుంటుందా అనే సందేహాన్ని వ్యక్తం చేసింది. సీఎ్‌సపై కోర్టు ధిక్కార కేసుల విచారణకు ప్రత్యేకంగా కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారంటే ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 208పై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. 
 
భారీ మొత్తంలో నిధుల విడుదలకు ట్రెజరీ రూల్స్‌ ఏ విధంగా అనుమతి ఇస్తాయో చెప్పాలని ఆదేశించింది. పిల్‌పై విచారణ పూర్తయ్యే వరకూ.. మంజూరైన నిధులు విడుదల చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది.
సీఎస్ పై కోర్టు ధిక్కార కేసుల్లో హాజరైన న్యాయవాదుల ఫీజుల కోసం రూ.58 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జూన్‌ 7న జీవో 208 జారీచేయడాన్ని తప్పుపడుతూ మహబూబ్‌నగర్‌ జిల్లా తలకొండపల్లికి చెందిన సి.ప్రభాకర్‌ ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఈ జీవో జారీచేశారని.. ఆయనే సంతకం చేస్తే జీవో వెలువడిందని, లబ్థిదారుడు కూడా ఆయనే కావడం గమనార్హమని పిటిషనర్‌ తరఫు సీనియర్‌ లాయర్‌ రవిచందర్‌ వాదించారు.
2013 నుంచి 2021 వరకూ సీఎ్‌సపై 181 కోర్టు ధిక్కార కేసులు ఉన్నాయని, ఒక్కో కేసుకు ఎంత డబ్బు ఫీజుగా చెల్లించాలో కూడా నిర్ణయించారని, ప్రజాధనాన్ని ఈ విధంగా ఒక అధికారి కేసుల వాదన నిమిత్తం మంజూరు చేయడం అన్యాయమని చెప్పారు. ఆ జీవోను రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటించాలని కోరారు.
కాగా, కోర్టుల్లో పెండింగ్‌‌లో ఉన్న భూ సేకరణ పరిహారానికి సంబంధించిన కేసుల విచారణకే రూ.58.95 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని సీఎస్‌‌ అఫిడవిట్‌‌ దాఖలు చేశారు. భూ సేకరణ కేసుల అప్పీళ్లకు సంబంధించి మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా జడ్జి రాసిన లేఖను పిల్‌‌గా తీసుకుని హైకోర్టు విచారణ చేపట్టిందని, దీనిని పిటిషనర్‌‌ తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. సీఎస్‌‌ అఫిడవిట్‌‌ దాఖలు చేసే సమయానికి పిల్‌‌పై హైకోర్టు విచారణ ముగిసి వాయిదా పడింది.
 
మరోవంక,  అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తే ఎందుకు అమలు చేయలేదని జీహెచ్‌ఎంసీని హైకోర్టు ప్రశ్నించింది. మూడు నెలల కిత్రం ఇచ్చిన ఆదేశాల అమలుకు కరోనా వైరస్‌ అడ్డం వచ్చిందా అని నిలదీసింది. మీనమేషాలు లెక్కించేలోగా అక్రమ నిర్మాణాలు పూర్తి అయిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 
 
ఒకసారి పూర్తయ్యాక.. క్రమబద్ధీకరణ స్కీంను ప్రభుత్వమే తెస్తుందని, ఈ తీరుతో అక్రమ నిర్మాణాలకు అడ్డు, అదుపు లేకుండా పోతోందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలపై కింది కోర్టు నుంచి స్టేలు తెచ్చుకుంటే వాటిని వెకేట్‌ చేయించే ప్రయత్నాలు జీహెచ్‌ఎంసీ చేయట్లేదని, దీంతో అక్రమ నిర్మాణాలు పూర్తి అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే లక్ష అక్రమ నిర్మాణాలు ఉంటాయని, రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని ఉంటాయోనని ధర్మాసనం వ్యాఖ్యానించింది.