బొమ్మై మంత్రివర్గంలో 29 మందికి చోటు

కర్ణాటక ముఖ్యమంత్రి  బసవరాజ్ బొమ్మై తన మంత్రివర్గంలో 29 మందికి చోటు కల్పించారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోట్ రాజ్‌భవన్‌లో 29 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.  ఆయన మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రులు లేరు. అంతకు ముందు బిఎస్ యడియూరప్ప సీఎంగా ఉన్న సమయంలో ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు.

అయితే ఈ దఫా ఉప ముఖ్యమంత్రులు అవసరం లేదని పార్టీ నాయకత్వం ఆదేశించిందని సీఎం బొమ్మై తెలిపారు. ఇటీవల యడియూరప్ప రాజీనామా చేయడంతో కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మై కొత్త సీఎంగా ప్రమాణం చేశారు. తాజాగా 29 మందితో బొమ్మై తన మంత్రివర్గం ఏర్పాటు చేశారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బసవరాజ్ బొమ్మై ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి మంత్రివర్గం కూర్పుపై సమాలోచనలు జరిపారు. అనుభవం గలవారికి, ఉత్సాహం గల కొత్తవారి మేలుకలయక తమ మంత్రివర్గం అని కొత్త మంత్రుల ప్రమాణస్వీకారంకు ముందుగా బొమ్మై చెప్పారు.  బొమ్మై మంత్రివర్గంలో ఏడుగురు ఓబీసీలు, ముగ్గురు ఎస్‌సీలు, ఒక్క ఎస్టీ, రెడ్డితోపాటు లింగాయత్ వర్గానికి అధిక ప్రాధాన్యాం ఇచ్చారు. ఒక మహిళకే స్థానం లభించింది. 29 మందిలో 26 మంది ఇంతకు ముందు యడియూరప్ప మంత్రివర్గంలో ఉన్నవారే కాగా, ఆరుగురు కొత్తవారున్నారు.

ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా సమగ్రమైన ఆలోచన తరువాత పార్టీ నేతలతో సమగ్ర చర్చల తరువాత మంత్రివర్గ ఎంపిక జరిగిందని బొమ్మై స్పష్టం చేశారు. ప్రజాహిత అధికార యంత్రాంగ కల్పనకు, రాబోయే ఎన్నికలకు సరైన ప్రతిష్ట దిశలో మంత్రివర్గ  ఏర్పాటు అయినట్లు తెలిపారు. ఇదంతా కూడా ప్రధాని నరేంద్ర మోదీ , హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షులు జెపి నడ్డా ఆదేశాల మేరకు జరిగినట్లు చెప్పారు.

కర్నాటక మంత్రివర్గంలో మొత్తం 34 మంది మంత్రులను తీసుకునేందుకు అధికారిక అవకాశం ఉంది. ఇప్పటికీ కొన్ని స్థానాలు ఖాళీగా ఉన్న విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా సిఎం బసవరాజ్ స్పందిస్తూ ఇది నిజమేనని దశలవారిగా విస్తరణ ఉంటుందని, ఇక ముందు అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం ఉంటుందని, దీనిని అంతా గుర్తించాల్సి ఉంటుందని సూచించారు. 

గత మంత్రివర్గంలోని కొందరు మంత్రులను ఇప్పుడు తీసుకోకపోవడంపై సిఎం స్పందిస్తూ వ్యవస్థాగత అనుభవం ఉన్న సీనియర్ నేతలు కొందరికి ఈసారి పార్టీ పరంగా బలోపేత బాధ్యతలు అప్పగిస్తారని వివరించారు.