బెంగాల్‌లో ఉపఎన్నికలు ఇప్పుడప్పుడే వద్దు

పశ్చిమ బెంగాల్‌లో ఖాళీగా ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలకు ఇప్పుడప్పుడే ఎన్నికలు నిర్వహించవద్దని ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి సూచించారు. కొవిడ్ మళ్లీ విజృంభిస్తోందని, ఇలాంటి సమయంలో ఎన్నికలు నిర్వహించి ప్రజల ప్రాణాల మీదకు తీసుకురావద్దని ఆయన స్పష్టం చేశారు. 
 
ఈ విషయమై శుక్రవారం కోల్‌కతాలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ‘‘ఉప ఎన్నికలు ఇప్పుడు నిర్వహించకూడదు. ముందు వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టాలి. బెంగాల్ ప్రభుత్వం కొవిడ్ వాస్తవ డేటాను దాచి పెడుతోంది. కేసులను తగ్గించి రోజూ 1000 లోపే చూపిస్తోంది’’ అని ఆరోపించారు.
 
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి మార్చి-ఏప్రిల్ మధ్యలో ఎనిమిది విడతల్లో ఎన్నికలు జరిగాయి. మే 2న విడుదలైన ఫలితాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 292 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో 213 స్థానాలను టీఎంసీ కైవసం చేసుకుంది. 
 
అయితే ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓడిపోయారు. అయినప్పటికీ పశ్చిమ బెంగాల్‌కు మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఆరు నెలలోపు అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంది.