కాంగ్రెస్ నేతలే ఎగతాళి చేస్తున్న రాహుల్ ప్రకటనలు 

కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీపై మండిపడ్డారు. రాహుల్ గాంధీ ప్రకటనలను కాంగ్రెస్ నేతలే ఎగతాళి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గ్రామస్తులు, పేదలు, రైతులు పడిన బాధ గురించి ఆయనకు ఎలాంటి అనుభవం లేదని ఎద్దేవా చేశారు.

రాజకీయంగా నిలదొక్కుకునేందుకు రాహుల్‌ చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో రోజుకొక అబద్ధం చెప్పడం అలవాటు చేసుకున్నారని విమర్శించారు. వ్యవసాయ చట్టాలను తీసుకొస్తామని తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, రాహుల్‌ గాంధీ ప్రస్తుతం చేస్తున్న ప్రకటనలపై పునరాలోచించాలని తోమర్‌ హితవు చెప్పారు.

వ్యవసాయ చట్టాల గురించి అప్పుడు అబద్ధాలు చెప్పారా లేదా ఇప్పుడు అబద్ధాలు చెబుతున్నారా అన్నదానిపై వారు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులను తప్పుదోవ పట్టించడానికి లేదా అరాచక వాతావరణాన్ని సృష్టించడానికి రాహుల్‌ గాంధీ ప్రయత్నించకూడదని తోమర్‌ సూచించారు.

కాగా, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత ఎనిమిది నెలలుగా పోరాడుతున్న రైతులకు మద్దతుగా రాహుల్‌ గాంధీ సోమవారం ట్రాక్టర్‌ను నడుపుతూ పార్లమెంట్‌ సమావేశాలకు వచ్చారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీపై కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ఈ మేరకు మండిపడ్డారు. 

ఇలా ఉండగా, దేశ‌వ్యాప్తంగా పంట రుణాల మాఫీ ఆలోచనేదీ ప్ర‌భుత్వ ప‌రిశీల‌న‌లో లేద‌ని కేంద్రం తేల్చి చెప్పింది. పంట రుణాల మాఫీ కోసం కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద ఎటువంటి ప్ర‌తిపాద‌న ప‌రిశీల‌న‌లో లేద‌ని కేంద్ర ఆర్థిక‌శాఖ స‌హాయ మంత్రి భ‌గ‌వ‌త్ క‌రాద్ స్పష్టం చేశారు. లోక్‌స‌భ‌లో స‌భ్యులు అడిగిన రాత‌పూర్వ‌క ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ  నాబార్డ్ వ‌ద్ద ఉన్న డేటా ప్ర‌కారం గ‌త మార్చి నెలాఖ‌రు నాటికి 13.85 కోట్ల ఖాతాల్లో రూ.16.80 ల‌క్ష‌ల కోట్ల రుణాలు ఉన్నాయ‌ని తెలిపారు.