
వచ్చే సెప్టెంబర్ నెలాఖరు నుంచి చిన్నారులకు కరోనా వ్యాక్సిన్లు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా వెల్లడించాయిరు. మూడు కంపెనీల టీకాలకు ఆగస్టు-సెప్టెంబర్ నాటికి అనుమతి లభిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాక్సినేషన్ పిల్లలను ఇన్‌ఫెక్షన్ ప్రమాదం నుంచి కాపాడుతుందని పేర్కొన్నారు.
చిన్నారులకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం వైరస్ ట్రాన్స్‌మిషన్ చైన్‌ను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారికి సంబంధించి కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వాటి కట్టడికి బూస్టర్ డోసులు అవసరమని డాక్టర్ గులేరియా అభిప్రాయపడ్డారు.
చాలా మందిలో వ్యాధి నిరోధకత తగ్గిపోతున్న సమయంలో కొత్త వేరియంట్లు ప్రమాదకరంగా మారుతాయని ఆయన భయాందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో డాక్టర్ రణదీప్ గులేరియా ప్రసంగీస్తూ జైడస్ ట్రయల్స్ పూర్తయ్యాయని, అత్యవసర అనుమతి కోసం కంపెనీ ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కోవాక్సిన్ ట్రయల్ కూడా ఆగస్టు-సెప్టెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉన్నదని చెప్పారు. ఫైజర్ వ్యాక్సిన్‌ను ఇప్పటికే యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆమోదించిందని తెలిపారు. దేశంలో ఇప్పటివరకు 42 కోట్లకు పైగా మందికి కొవిడ్ వ్యాక్సిన్లు అందించామని, ఈ ఏడాది డిసెంబర్ కల్లా పెద్దవారికందరికీ టీకాలు వేసే కార్యక్రమాన్ని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గులేరియా వెల్లడించారు.
11-17 ఏళ్లలోపు పిల్లలతో కలిసి జీవించే వృద్ధుల్లో వ్యాధి సోకే ప్రమాదం 18-30 శాతం పెరుగుతోందని లాన్సెట్ ఒక అధ్యయనాన్ని విడుదల చేయడాన్ని ప్రస్తావిస్తూ వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వ్యాధి సొకే ప్రమాదం అధికంగా ఉందని తెలిపారు. చిన్నారులను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు నిరాకరించడానికి ఇది కూడా ఒక కారణమని పేర్కొన్నారు. స్వల్పంగా వ్యాధి సోకిన చిన్నారులు వృద్ధులకు వ్యాప్తి చేయవచ్చని, దీనిపై మరింత అధ్యయనం అవసరమని చెప్పారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్