ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఏపీ ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఏపీ ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత

ఏపీ రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై సోమవారం వాదనలు విన్న ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.  అమరావతి భూముల కొనుగోలు కేసులో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగలేదంటూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది.

వాదనలు ముగిసిన అనంతరం జస్టిస్ వినీత్ సరన్, జస్టిస్ దినేష్ మహేశ్వరితో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది. అమరావతి భూములపై దాఖలైన పిటిషన్‌‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.  త్వరలో లిఖిత పూర్వక ఉత్తర్వులిస్తామని స్పష్టం చేసింది.

ప్రభుత్వం తరఫున దుష్యంత్‌, మెహఫూజ్‌.. ప్రతివాదుల తరఫున పరాస్, శ్యామ్‌, సిద్ధార్థ తమ వాదనలను కోర్టుకు వినిపించారు. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చట్టం కింద అమరావతిలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ చేపట్టవచ్చని, ప్రాథమిక దశలో ఉన్న విచారణను హైకోర్టు అడ్డుకుందని ప్రభుత్వ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు.

గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని, ఆ ఉత్తర్వుల్లో కొన్ని అంశాలపై అభ్యంతరాలు ఉన్నాయని వివరించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై 2014 నుంచి 2019 వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, ప్రభుత్వం మారాకే ఫిర్యాదులు అందినట్లు కోర్టుకు తెలిపారు.

మరోవైపు ప్రభుత్వ వాదనలతో ప్రతివాద న్యాయవాదులు విభేదించారు. అమరావతిలో అక్రమాలు జరిగాయని ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదని, అలాంటప్పుడు ఈ అంశంపై విచారణ చేయాల్సి న అవసరమేంటని న్యాయవాది ఖుర్షీద్ కోర్టును అడిగారు. ఈ కేసులో ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్ చట్టం వినియోగంలోకి రాదని పేర్కొన్నారు. రాజధాని ఏర్పాటు బహిరంగంగానే జరిగిందని, ఆరేళ్ల తర్వాత భూములు అమ్మినవారి తరఫున ఎవరో ఫిర్యాదు చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.