తెలుగు భాషకు ఆదరణ తగ్గించేందుకు యత్నాలు

తెలుగు భాషకు ఆదరణ తగ్గించేందుకు యత్నాలు జరుగుతున్నాయని అంటూ సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పరోక్షంగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మాతృ భాష అనేది జాతి ఔన్నత్యానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. 
 
తెలుగు భాషను పరిరక్షించి భావి తరాలకు అందించాలని ఆయన సాహితీ ప్రియులను కోరారు. తెలుగువారు భాషాభిమానులు మాత్రమేనని, దురాభిమానులు కారని ఆయన స్పష్టం చేశారు. తిరుపతిలో ఆదివారం వర్చువల్ విధానంలో  అవధాని మేడసాని మోహన్‌ ఆధ్వర్యంలో చతుర్గుణిత అష్టావధానం నిర్వహించారు. 
 
అష్టావధానంలో భాగంగా రమణ తొలి ప్రశ్న వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ సాహితీ ప్రక్రియను జనరంజకంగా తీర్చిదిద్దాలని సాహితీ ప్రియులకు సూచించారు. సాహిత్య రూపం కనుమరుగు కాకూడదని, అలా జరిగితే  తిరిగి సృష్టించలేమని ఆయన స్పష్టం చేశారు.
 
సాహితీ ప్రక్రియను ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా మార్పు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. సాహితీ సేవకు తన వంతు  కృషి చేస్తానని రమణ తెలిపారు. అవధాన ప్రక్రియ అనేది తెలుగు భాషకు ప్రత్యేకమని, శతాబ్దాల సాహితీ తపస్సు నుంచి అవధానం పుట్టిందని ఆయన తేల్చిచెప్పారు. జ్ఞాపకశక్తి, అపార మేధస్సు, భాష మీద పట్టు మేళవింపే అవధానమని ఆయన పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం జీవన గమనాన్ని మారుస్తుందని ఆయన వెల్లడించారు.