గోదావరి ముంపుతో పోలవరం నిర్వాసితుల ఆందోళన 

ఎగువన వర్షాలు కురుస్తుండడంతో గోదావరి నదిలోనూ, పోలవరం కాఫర్‌ డ్యాం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో, ఉభయ గోదావరి జిల్లాలోని పోలవరం నిర్వాసితులు ఒకపక్క వర్షం, మరోపక్క ముంపుతో నానా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో పడవలపై ప్రయాణం సాగిస్తున్నారు. 

ప్రస్తుతం గోదావరి నీటిమట్టం కాపర్‌ డ్యాం వద్ద 22.27 మీటర్లు, పోలవరం ప్రాజెక్టు వద్ద 27.54 మీటర్లు, ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 10.90 అడుగులు ఉంది. బ్యారేజీ నుంచి తూర్పు, మధ్య, పశ్చిమ కాల్వలకు 17 వేల క్యూసెక్కులు, మిగులు జలాలు లక్ష క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 

వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పోలవరంలో  జరపవలసిన పర్యటన వాయిదా పడింది. కాఫర్‌ డ్యామ్‌ వల్ల తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని దండంగి, పూడిపల్లి, కె.వీరవరం, తొయ్యేరు, మంటూరు, దేవీపట్నం, కచ్చులూరు, పెనికలపాడులో లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి.

తొయ్యేరు, మంటూరు, దేవీపట్నం, కచ్చులూరు గ్రామస్తులు గోకవరంలో పునరావాస కాలనీలకు వెళ్లారు. పూడిపల్లి, కె.వీరవరం, దండంగి గ్రామస్తులు ముంపులోనే ఉన్నారు. కొంతమంది సమీపంలోని కొండలు, గుట్టలపై తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. విఆర్‌.పురంలోని శ్రీరామగిరిలోని లోతట్టు ప్రాంత ప్రజలు ముంపు బారిన పడ్డారు.

వీరందరూ కొండపై తాత్కాలిక టార్పాలిన్లతో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వర్షాలకు విషపురుగులు, పాములు గుడారాల్లోకి వస్తున్నాయని బాధితులు వాపోతున్నారు. తమకు ఇప్పటి వరకూ ఎవరూ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందలేదని, కనీసం కిరోసిన్‌, నిత్యావసర సరుకులు కూడా అందించలేదని ఆవేదన చెందుతున్నారు.

బ్యాక్‌ వాటర్‌ వల్ల ముంపునకు గురయ్య అవకాశం ఉండడంతో పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం గొమ్ముగూడెం నిర్వాసిత గ్రామ ప్రజలను అధికారులు హెచ్చరించారు. దీంతో, 180 కుటుంబాలు మండల పరిధిలోని తమకు కేటాయించిన రావికుంటలోని పునరావాస కాలనీకి ట్రాక్టర్లపై సామగ్రితో తరలిపోయాయి. గోదావరి వరద తగ్గే వరకూ అక్కడ ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

పోలవరం ఎగువ కాపర్‌ డ్యామ్‌ 42.5 మీటర్ల ఎత్తున నిర్మాణానికిగాను ఇప్పటికే 39 మీటర్ల నిర్మాణం పూర్తయింది. దీంతో, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వస్తున్న వరద నీరు పోలవరం నిర్వాసిత గ్రామాలను ముంచెత్తే పరిస్థితి ఏర్పడింది. 

కాపర్‌ డ్యామ్‌ 42.5 మీటర్ల నిర్మాణం జరిగితే పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలో 19 గ్రామాలు, వేలేరుపాడు మండలంలో 17 గ్రామాలు, కుక్కునూరు మండలంలో ఎనిమిది మొత్తం 45 గ్రామాలు ముంపునకు గురవుతాయని తేల్చారు. పోలవరం మండలంలో 3,300 కుటుంబాలు, వేలేరుపాడులో 3,618, కుక్కునూరులో 3,024 కుటుంబాలు మొత్తం 9,942 కుటుంబాలు ఉన్నాయి. 

వీరందరికీ పూర్తి స్థాయిలో పరిహారం అందించి మే నెలాఖరుకు ఖాళీ చేయిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. పునరావాసం, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కూడా పూర్తి స్థాయిలో ఉండలేదు. గతంలో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 50 అడుగుల వరకూ వస్తే తప్ప కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని గ్రామాలు ముంపునకు గురయ్యేవి కావు. 

కాపర్‌డ్యామ్‌ నిర్మాణంతో 35 అడుగులకే కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని గ్రామాలు మొత్తం ముంపునకు గురయ్యే పరిస్థితి ఉంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 17 అడుగులకు చేరింది. పైనుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో, పోలవరం నిర్వాసితులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.