కీలకమైన కమిటీల్లో స్మ్రితి ఇరానీ, భూపేందర్, సోనావాల్ 

కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు జరిపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు కాబినెట్  కమిటీలను పునర్వ్యవస్థీకరించారు. తన అధ్యక్షతన గల కీలకమైన కమిటీలలో కొత్తగా స్మ్రితి ఇరానీ, భూపేందర్ యాదవ్, సర్బానంద సోనావాల్, మనసుఖ్ మాండవీయ, జి కిషన్ రెడ్డి వంటి వారికి స్థానం కల్పించారు. 

కీలకమైన రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకొని రాజకీయ వ్యవహారాల కాబినెట్ కమిటీలో  స్మ్రితి ఇరానీ, భూపేందర్ యాదవ్, సర్బానంద సోనావల్ లను సభ్యులుగా నియమించారు. 

సీసీపీఏ‌లో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం, కార్పొరేషన్ మంత్రి అమిత్‌షా, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ మంత్రి నితిన్ గడ్కరి, ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వాణిజ్య, పరిశ్రమ శాఖ మంత్రి పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సైతం ఉన్నారు.

 కాగా, రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కాబినెట్ కమిటీలో కొత్తగా  వీరేందర్ కుమార్,  కిరణ్ రిజిజు, అనురాగ్ ఠాకూర్ లను సభ్యులుగా నియమించారు. గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా కూడా ఈ కమిటీలో ఉన్నారు. రవిశంకర్ ప్రాసద్ స్థానంలో రిజిజు, ప్రకాష్ జవదేకర్ స్థానంలో ఠాకూర్‌ను ఈ కమిటీలో తీసుకున్నారు.

అయితే ప్రధాన మంత్రి అధ్యక్షతన గల అత్యున్నత విధాన నిర్ణాయక  భద్రతా వ్యవహారాల కాబినెట్ కమిటీలో ఎటువంటి మార్పులు లేదు. అదే  విధంగా, కేంద్ర ప్రభుత్వంలో కాబినెట్ కార్యదర్శి, ఆ పై హోదా గల ఉన్నతాధికారులను నియమించే ప్రధాని నేతృత్వంలోని కాబినెట్ నియామకాల కమిటీలో కూడా ఎటువంటి మార్పులు చేయలేదు. 

భద్రతా వ్యవహారాల కమిటీలో ప్రధానితో పాటు హోమ్ మంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సభ్యులుగా ఉన్నారు. నియామకాల కమిటీలో ప్రధానితో పాటు అమిత్ షా సభ్యునిగా ఉన్నారు. 

ప్రధాని అధ్యక్షతన గల పెట్టుబడులు, వృద్ధి కాబినెట్ కమిటీలో కొత్తగా నారాయణ రాణే, జ్యోతిరాదిత్య సింధియా,  అశ్వనివైష్ణవ్ లను సభ్యులుగా చేశారు. ప్రధాని అధ్యక్షతన గల సాధికారికత, నైపుణ్యాభివృద్ధి కాబినెట్ కమిటీలో కొత్తగా అశ్వని వైష్ణవ, భూపేందర్ యాదవ్, రామచంద్ర ప్రసాద్ సింగ్, జి కిషన్ రెడ్డిలను సభ్యులుగా చేశారు.