ఏపీ ప్రభుత్వంకు శిరోభారంగా  కోర్ట్ ధిక్కరణ కేసులు 

ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వానికి కోర్టు ధిక్కరణ కేసులు శిరోభారంగా మారుతున్నాయి. ఒకటీ, రెండు కాదు ఏకంగా 800కు పైగా కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నటు తెలుస్తున్నది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో కొందరు అధికారులు నిర్లక్ష్యం చూపుతుండగా, మరికొందరు సాంకేతిక కారణాలు చెబుతూ తీర్పులు అమలు చేయడం లేదు. ఇవే ఆ తరువాత కోర్టు ధిక్కరణ కేసులుగా మారుతుండటంతో తలలు పట్టుకుంటున్నారు. 

పరిస్థితి తీవ్రమవుతుండటంతో తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్‌దాస్‌ ఈ విషయమై దృష్టి సారించారు. వివిధ శాఖల అధికారులు, న్యాయశాఖతోనూ సోమవారం  ఆయన సమీక్ష జరిపారు. ప్రభుత్వపరంగా వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై కోర్టు నుంచి జారీఅయ్యే ధిక్కార కేసులపై ఆయా శాఖల అధికారులు సకాలంలో స్పందించాలని ప్రభుత్వ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఆదేశించారు.

వకాల్తాలు ఫైల్‌ చేయడం, అప్పీళ్లకు వెళ్లడం వంటి చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టి ప్రభుత్వ వాదనను కోర్టుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కోర్టులు ఇకపై ప్రభుత్వ అధికారులపై సీరియస్‌ అయ్యే పరిస్థితులకు ఆస్కారం లేకుండా ధిక్కార కేసులు వస్తే తక్షణం స్పందించాలని స్పష్టం చేయారు.

ఈ కేసులకు సంబంధించి ఏ విధంగా మెరుగైన చర్యలు తీసుకోవాలనే విషయమై త్వరలో అడ్వకేట్‌ జనరల్‌, ప్రభుత్వ న్యాయవాదులు, సహాయ ప్రభుత్వ ప్లీడర్లతో సమావేశం ఏర్పాటు చేయాలని న్యాయశాఖ కార్యదర్శిని ఆదేశించారు.  ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. అలాగే జిల్లా స్థాయిల్లో కూడా పెద్దగానే కేసులు ఉన్నాయి.

వీటిపై న్యాయస్థానాలు విచారణ నిర్వహించి కీలక ఆదేశాలు జారీచేస్తున్నాయి. ఈ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైన శాఖలపై సంబంధిత వ్యక్తులు, సంస్థలు తిరిగి ధిక్కరణ వ్యాజ్యాలు దాఖలవుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఇద్దరు సీనియర్‌ ఐఎఎస్  అధికారులకు హైకోర్టు వారం రోజుల జైలు శిక్ష విధించింది. దీంతో వయసు పైబడిన వారమంటూ న్యాయ స్థానాన్ని వేడుకోవాల్సి వచ్చింది.

ప్రధానంగా అన్ని శాఖల్లోనూ ధిక్కరణ కేసులు కనిపిస్తుండగా, ఆర్ధికశాఖలో మరింత ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటివరకు 138 ధిక్కరణ కేసులు వచ్చినట్లు తెలిసింది. వీటిలో కొన్నింటిని న్యాయస్థానం రద్దు చేయగా, ఇంకా వందకు పైగానే ధిక్కరణ కేసులు విచారణలో ఉన్నాయి. వీటిల్లో ఉద్యోగాల క్రమబద్ధీకరణ, పింఛన్లు, పరిహారాలు చెల్లింపులు, ఇంక్రిమెంట్లు, నిర్వహణ నిధులు ఇవ్వకపోవడం వంటి కేసులు ఎక్కువగా ఉన్నాయి. 

ఇవన్నీ ఆర్ధిక అంశాలతో కూడుకుని ఉండడం వల్ల ఆర్ధికశాఖ ఆయా కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేకపోతున్నట్లు కనిపిస్తోంది. దీంతో  చివరకు ధిక్కరణ నోటీసులు అందుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇద్దరు న్యాయ కన్సల్టెంట్లను నియమించుకున్న ఆర్ధికశాఖ, తాజాగా ఒక సీనియర్‌ న్యాయవాదికి కూడా నియమించుకునేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.