ఇక ఎపిలో మాస్క్ పెట్టుకోకపోతే రూ 100 జరిమానా

ఇక ఎవరైనా మాస్క్‌ను ధరించకపోతే రూ.100ల జరిమానాను కచ్చితంగా అమలు చేసేవిధంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దుకాణాల్లోనూ సిబ్బంది దగ్గర నుంచి వినియోగదారుల వరకూ అందరూ మాస్క్‌లను ధరించాల్సిందే. ఎవరైనా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే ఆ దుకాణాలకు భారీ జరిమానాలతో పాటు అవసరమైతే 2, 3 రోజులు దుకాణాలు మూసివేతకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

ఎవరైనా ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేసి ఉల్లంఘనలకు పాల్పడితే.. వారి ఫొటో తీసి పంపినా జరిమానాలను విధించే విధంగా దీని కోసం ప్రత్యేక వాట్సాప్‌ నంబర్‌ను ఏర్పాటు చేశామని సిఎం జగన్‌ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. ప్రజలెవ్వరూ గుమిగూడకుండా కఠిన ఆంక్షలతోపాటు మార్కెట్లు, తదితర చోట్ల కూడా అందరూ మాస్క్‌లను ధరించాలంటూ ఆదేశించారు. 

 
అందరూ మాస్క్‌లు ధరించేలా చూడాలని మార్కెట్‌ కమిటీలను సిఎం జగన్‌ ఆదేశించారు. కరోనాను కట్టడి చేసే దిశగా ఎపి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ఎపి సిఎం జగన్‌ సోమవారం సమీక్ష నిర్వహించారు.
మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులతో చర్చించారు. జిల్లాల వారీగా కేసుల వివరాలను అధికారులు సిఎం జగన్‌కు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు కానుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సడలింపు ఇచ్చారు.
 
కాగా,  స్కూళ్లు తెరిచే ముందు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల టీచర్లందరికీ కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డిగ్రీ విద్యార్ధులకు వాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టాలని, ఆయా కాలేజీల్లోనే క్యాంపులు పెట్టి వాక్సిన్‌ ఇవ్వాలని అధికారులను సిఎం జగన్‌ ఆదేశించారు. 
 
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో కరోనా యేతర వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పిహెచ్‌సి ల వారీగా సమీక్ష చేసి తగిన చర్యలు తీసుకోవాలని సిఎం జగన్‌ పేర్కొన్నారు.