“కొవిన్‌” ప్లాట్‌ఫామ్‌ను ఉచితంగా ఇస్తాం

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సాఫీగా సాగడానికి ఎంతగానో దోహదపడుతున్న కోవిన్ ప్లాట్‌ఫామ్ ను ఇతర దేశాలన్నిటికీ ఉచితంగా అందజేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం చెప్పారు. వాణిజ్య ప్రయోజనీలకన్నా మానవత్వం ముఖ్య మని భారత్ బలంగా నమ్ముతుందని ఆమె తెలిపారు. 

ప్రస్తుతం జరుగుతున్న జి20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం రెండోరోజున వర్చువల్ విధానంలో పాల్గొన్న నిర్మలా సీతారామన్ ఈ విషయం చెప్పారు. 

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో వైద్య సేవలను అందించడంలో టెక్నాలజీని అను సంధానం చేయడం ద్వారా ఎలాంటి సత్ఫలితాలను సాధించగలిగామో ఆమె ఈ సమావేశంలో వివరించారు. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం వరస ట్వీట్లలో తెలియజేసింది.

మరోవంక, ఇటలీ, భారత్ ల ఆర్థిక సహకార సంయుక్త సంఘం కీలక భేటీ జరిగింది. వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. కొవిన్ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌కు ఉభయపక్ష గుర్తింపు, ప్రయాణ ఆంక్షల ఎత్తివేత, ఇటలీలో పనిచేసే భారతీయులకు సామాజిక భద్రత కల్పన వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 

సమావేశానికి భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, ఇటలీ విదేశాంగ మంత్రి లూర్గీ డిమె యివో సహ సారథ్యం వహించారు. కొవిన్ యాప్ ద్వారా టీకాలు వేసుకునే వారికి ప్రయాణాల అనుమతులు, సర్టిఫికెట్‌కు పరస్పర గుర్తింపు వంటి అంశాలను భారత్ ప్రస్తావించింది.

ద్వైపాక్షిక వాణిజ్య, పెట్టుబడులు, ఆహార శుద్ధి, జవుళి, రైల్వే, లెదర్, స్టార్టప్స్, ఎస్‌ఎంఇలకు ప్రోత్సాహకాల వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిపారు.