
భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ టీకాకు త్వరలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి దక్కనున్నది. అత్యవసర వినియోగ జాబితాలో కోవాగ్జిన్‌ను చేర్చేందుకు డబ్ల్యూహెచ్‌వో సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా 4 నుంచి ఆరు వారాల్లోగా లేదా ఆగస్టు తొలి వారంలో కోవాగ్జిన్ టీకాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నిర్ణయాన్ని వెల్లడించనున్నది.
హైదరాబాద్‌లో ఉన్న భారత్ బయోటెక్ సంస్థ ఇప్పుడిప్పుడే కోవాగ్జిన్‌కు సంబంధించిన డేటాను తన పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తోందని, ఆ డేటాను సమీక్షిస్తున్నామని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వెబినార్‌లో ఆమె దీని గురించి మాట్లాడారు.
డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల ప్రకారం .. ఎమర్జెన్సీ అనుమతి జాబితా కోసం వ్యాక్సిన్ స్టడీ చేస్తున్నట్లు సౌమ్య తెలిపారు. కొత్త ఉత్పత్తులు లేదా లైసెన్సు లేనటువంటి ఉత్పత్తుల వినియోగం కోసం అత్యవసర అనుమతి విధానాలను పాటిస్తుంటారు.
అయితే వ్యాక్సిన్ల విషయంలో మూడవ దశ ట్రయల్స్ పూర్తి కావాలని, దానికి సంబంధించిన డేటా వచ్చిన తర్వాత నిపుణుల సలహా మండలి నిర్ణయం తీసుకుంటుందని స్వామినాథన్ తెలిపారు. డేటా సంపూర్ణంగా ఉండాలని, వ్యాక్సిన్ రక్షణ, సామర్థ్యం, ఉత్పత్తి నాణ్యత ప్రమాణాలను పరిశీలిస్తారని చెప్పారు.
భారత్ బయోటెక్ సంస్థ తన డేటాను ప్రజెంట్ చేసిందని, మరో నాలుగు నుంచి ఆరు వారాల్లోగా ఎమర్జెన్సీ వాడకం జాబితాలో కోవాగ్జిన్ చేరుతుందని సౌమ్య వెల్లడించారు.
కాగా, కరోనా మహమ్మారి వ్యాప్తి నెమ్మదించలేదని, చాలా దేశాల్లో కేసులు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయని సౌమ్యా స్వామినాథన్ హెచ్చరించారు. పలుదేశాల్లో డెల్టా వేరియంట్ ఉద్ధృతంగా ఉందని చెప్పారు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 5 లక్షల మంది కరోనా బారినపడ్డారని, 9,300 మంది చనిపోయారని ఆమె తెలిపారు.
వ్యాక్సిన్ల కొరత, డెల్టా వేరియంట్, కొవిడ్ నిబంధనలు పాటించకపోవడం కరోనా కేసుల పెరుగుదలకు కారణం అని ఆమె పేర్కొన్నారు.
More Stories
కార్మిక చట్టాల అమలుకై ఐటి ఉద్యోగుల ఆందోళన
357 ఆన్లైన్ మనీ గేమింగ్ సైట్స్‌పై కేంద్రం కొరడా
డాలర్ ను బలహీనం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదు