హిమాచల్ మాజీ సీఎం వీరభద్రసింగ్ మృతి 

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు వీర‌భ‌ద్ర‌సింగ్‌ (87) క‌న్నుమూశారు. దీర్ఘ‌కాలం అనారోగ్యం కార‌ణంగా ఆయ‌న గ‌త కొంత‌కాలంగా సిమ్లాలోని ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో గురువారం తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచారు.
ఇందిరాగాంధీ మెడిక‌ల్ కాలేజీ, ఆస్ప‌త్రి మెడిక‌ల్ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ జ‌న‌క్ రాజ్ మాట్లాడుతూ.. వీర‌భ‌ద్ర‌సింగ్‌కు గ‌త కొంత‌కాలంగా ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్న‌ట్లు చెప్పారు. ఏప్రిల్ 13న ఆయ‌న కొవిడ్‌-19కు గుర‌య్యార‌న్నారు. అనంత‌రం మోహాలీలోని మ్యాక్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించిన‌ట్లు తెలిపారు.

కాంగ్రెస్‌ తరపున తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ఎంపీగా ఆయన ఎన్నికయ్యారు. ఇక హిమాచల్‌ప్రదేశ్‌కు ఆయన నాలుగో ముఖ్యమంత్రిగా పని చేశారు. అప్పటి నుంచి ఆరుసార్లు దఫాలుగా సీఎంగా ఆయన సేవలందించారు.  

1934 జూన్‌ 23న జన్మించిన వీర్‌భద్ర సింగ్‌.. రాజ కుటుంబంలో పుట్టారు. అందుకే జనమంతా రాజా సాహిబ్‌ అని ముద్దుగా పిల్చుకుంటారు. 1976 ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో ఆయన ప్రతినిధిగా వ్యవహరించారు. అంతేకాదు కేంద్ర కేబినెట్‌లోనూ పలు కీలక పదవులు అధిరోహించారు.

ఆయన సతీమణి ప్రతిభా సింగ్‌ మండి నియోజకవర్గం నుంచి లోక్‌ సభకు రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు. కుమారుడు విక్రమాదిత్య సింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు. 

జవహర్ లాల్ నెహ్రు నుండి మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్ ప్రధాన మంత్రులు అందరి వద్ద వివిధ హోదాలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.  ఆధునిక హిమాచల్ ప్రదేశ్ నిర్మాతగా ఆయనను భావిస్తారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులపాటు అధికారికంగా సంతాప దినాలుగా ప్రకటించింది.