అంతరిక్షంలోకి తెలుగు మూలాలున్న ఓ మహిళ

తెలుగు మూలాలున్న ఓ మహిళ చరిత్ర సృష్టించబోతున్నారు. అంతరిక్షంలోకి అడుగుపెట్టి.. ఆ ఘనత సాధించిన మొట్టమొదటి తెలుగు మహిళగా గుర్తింపు పొందబోతున్నారు. జూలై 11న అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అంతరిక్ష వాహక నౌకను ప్రయోగిస్తోంది. నలుగురు ప్రయాణికులతో ఈ వాహక నౌక అంతరిక్షానికి బయల్దేరుతుందని తాజాగా కంపెనీ వెల్లడించింది. నలుగురు ప్రయాణికులలో భారత సంతతికి చెందిన శిరీష బండ్ల కూడా ఉన్నారని ప్రకటించింది.

కాగా.. అంతరిక్షంలోకి ప్రయాణికులను తీసుకెళ్లేందుకు వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు జూన్ 25న ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ లైసెన్సు జారీ చేసింది. ఈ క్రమంలో అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఈ ప్రయోగాన్ని చేపడుతోంది. 

ఈ నెల 11న న్యూ మెక్సికో నుంచి బయల్దేరే స్పేస్ ఫ్లైట్‌లో ఇద్దరు ప్రయాణికులతో పాటు వర్జిన్ గెలాక్టిక్ అధిపతి రిచర్డ్ బ్రాన్సస్ సహా మరో ముగ్గురు కంపెనీ ప్రతినిధులు అంతరిక్షయానం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే వర్జిన్ గెలాక్టిక్ ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యక్షురాలి హోదాలో ఉన్న శిరీష బండ్ల అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నారు. 

శిరీష బండ్ల ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జన్మించారు. అనంతరం కుటుంబంతో కలిసి ఆమె అమెరికా వెళ్లి, అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె వాషింగ్టన్‌లో నివసిస్తున్నారు. కాగా.. ఈ నెల 11న బయల్దేరే వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు చెందిన అంతరిక్ష వాహక నౌకలో ప్రయాణించి అంతరిక్షంలో అడుగుపెట్టనున్నారు.

దీంతో అంతరిక్షంలో అడుగుపెట్టిన మొట్టమొదటి తెలుగు మహిళగా ఆమె గుర్తింపు పొందనున్నారు. రెండవ భారతీయ మహిళ, నాల్గవ భారతీయురాలు కూడా చరిత్ర సృష్టించబోతున్నారు.ఈ రాకెట్‌లో అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఇప్పటికే దాదాపు 600మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారట. 

మరోవైపు, అమెజాన్ చీఫ్‌ జెఫ్ బెజోస్ ఈ నెల 20న అంతరిక్ష పర్యటనకు పోటీగా ఆయన కంటే ముందుగానే వర్జిన్ గెలాక్టిక్ రంగంలోకి దిగుతుండటం గమనార్హం.  శిరీష బండ్ల జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. అంతేకాకుండా పర్డ్యూ విశ్వవిద్యాలయంలో ఏరోనాటికల్-ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ పట్టా పొందారు.

కమర్షియల్ స్పెస్‌ఫ్లైట్ ఫెడరేషన్‌లోని స్పెస్ పాలసీ డిపార్ట్‌మెంట్‌లో పని చేశారు. అంతరిక్షయానంపై స్పందించిన ఆమె.. సంతోషం వ్యక్తం చేశారు. అంతరిక్షంలో అడుగుపెట్టాలని చిన్ననాటి నుంచే కలలు కన్నట్టు వెల్లడించారు.

కల్పన చావ్లా  గురించి విన్న తర్వాత తనకు  అంతరిక్షయానం పట్ల ఆసక్తి కలిగి, అటువైపు దృష్టి సారించినట్లు గతంలో ఒక ఇంటర్వ్యూలో శిరీష తెలిపారు. “అంతరిక్షంలో ప్రవేశించిన మొదటి భారతీయ మూలాలున్న మహిళ కల్పన చావ్లా  గురించి తెలిసేవరకు నాకెప్పుడూ అంతరిక్ష ప్రయాణం గురించిన ఆలోచనలు లేవు. అంతరిక్షం వైపు వెళ్లాలని ఆమె నాకు స్ఫూర్తి కలిగించారు” అని ఆమె చెప్పారు.