ప్రజా ఉద్యమంగా తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి

తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపిచ్చారు. ఆదివారం నిర్వహించిన ‘రాష్ట్రేతర తెలుగు సమాఖ్య’ 6వ వార్షికోత్సవంలో ఆయన విశాఖలోని పోర్టు ట్రస్ట్‌ అతిథిగృహం నుంచి వర్చువల్‌ విధానంలో ముఖ్యఅతిథిగాపాల్గొంటూ తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల ఘనతను చాటుకునేందుకు తెలుగువారంతా సంఘటితం కావాలని కోరారు. 

మనుషులనే గాక తరాలను సైతం కలిపే గొప్ప శక్తి భాష, సంస్కృతులకు ఉందని తెలిపారు. మనల్ని సంఘటితంగా కట్టి ఉంచే మొదటి గొలుసు మాతృభూమి అయితే, రెండో గొలుసు భాష, సంస్కృతులని ఆయన పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల వెలుపల నివసిస్తున్న తెలుగువారంతా తమ భాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ, వాటిని తరువాతి తరాలకు అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

మన ఆట, పాట, భాష, యాస, గోస, కట్టు, బొట్టు వంటి సంప్రదాయాలను పునరుజ్జీవింప చేసుకోవాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు చెప్పారు. మాతృభాషను విస్మరిస్తే మన సంస్కృతి, సాహిత్యం, ఆచార వ్యవహారాలు, అలవాట్లు, కట్టుబాట్లు ముందుతరాలకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అందుకే తెలుగువారందరూ తెలుగు భాష పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. 

ఒక భాషను నిర్లక్ష్యం చేయడం దాని క్షీణతకు దారితీస్తుందని స్పష్టం చేశారు. మాతృభాషను కాపాడుకోవడం, ప్రోత్సహించడం ప్రతివ్యక్తి బాధ్యత అని చెప్పారు. తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణకు ఉభయ తెలుగు రాష్ట్రాల వెలుపల వెయ్యికిపైగా సంస్థలు పాటు పడుతున్నాయని, ఈ సంస్థలన్నీ రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ద్వారా ఏకతాటిపైకి వచ్చి అనేక సంగీత, సాహిత్య, భాషాభివృద్ధి కార్యక్రమాలతో తెలుగు సమాజ నిర్మాణానికి చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన ప్రశంసించారు. 

భాషాభివృద్ధి కోసం ప్రభుత్వాలు చేస్తున్న కృషి మాత్రమే చాలదని, అందుకు భాష పరిరక్షణ, వ్యాప్తి ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. లేకపోతే తెలుగు భాషను సంరక్షించుకోవడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.  పరభాషా వ్యామోహం నుంచి బయటపడటంతో పాటు తెలుగు వారందరూ తెలుగులో మాట్లాడం, ప్రభుత్వాలు మాతృభాషను ప్రోత్సహించేలా ఒత్తిడి తీసుకురావడం అవసరమని వెంకయ్యనాయుడు కోరారు. R

తెలుగు రాష్ట్రాలకు వెలుపల ఉన్న తెలుగువారంతా తమ రాష్ట్రాలలో  భాష, సంస్కృతుల గొప్పతనాన్ని చాటుకునే దిశగా తెలుగు సాహిత్య అనువాదంపై చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. భాషను సాంకేతికతతో అనుసంధానం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. 

ఈ వర్చువల్‌ సమావేశంలో హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖామంత్రి శశి పంజా, ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌, అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు సీఎంకే రెడ్డి, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు సుందరరావు, కార్యదర్శి పీవీపీసీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.