బండి సంజయ్ రెండు నెలల పాదయాత్ర 

తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర చేపట్టబోతున్నారు. వచ్చే నెలాఖరులో ఈ యాత్ర ప్రారంభించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకు పార్టీ జాతీయ నాయకత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తున్నది. సంజయ్‌ పాదయాత్రకు సంబంధించి రూట్‌మ్యాప్‌ రూపొందించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

సుమారు రెండు నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుందని చెబుతున్నారు. ఎక్కడి నుంచి పాదయాత్ర చేపట్టాలి? ఏయే జిల్లాల్లో కొనసాగాలి? అన్న అంశాలపై కసరత్తు చేస్తున్నారు. పాదయాత్ర ఎక్కడ ప్రారంభమైనా, ముగింపు సభ మాత్రం హుజూరాబాద్‌లో భారీ ఎత్తున ఉండబోతోందని పార్టీ వర్గాలు తెలిపాయి.

వాస్తవానికి, రాష్ట్రంలో పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకూ పాదయాత్ర చేపట్టాలని సంజయ్‌.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు భావించారు. అయితే, తర్వాత వివిధ ఎన్నికలు రావడంతో అది వాయుదా పడుతూ వచ్చింది.

కాగా, సీఎం కేసీఆర్‌ దృష్టంతా ఢిల్లీ కుర్చీపైనే ఉందని,  కొడుకును సీఎంగా చేయాలని, తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే తపన తప్ప, వేరే ధ్యాసేలేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. జాతీయ రాజకీయాల్లో మద్దతిచ్చే షరతుపై జగన్‌తో లోపాయికారీ ఒప్పందం ఉందని, అందువల్లే ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు చేపడుతున్నా అడ్డుకోవడం లేదని విమర్శించారు.

పాలమూరులో స్థానిక మంత్రిపై వస్తున్న భూకబ్జాల ఆరోపణలపై సీఎం తక్షణం విచారణకు ఆదేశించాలని ఆమె కోరారు.  మరియమ్మ లాకప్‌డెత్‌పై సీఐ, డీఎస్పీలపై చర్యలు తీసుకోవాలని ఆమె  డిమాండ్‌ చేశారు.