ఎమ‌ర్జెన్సీ చీక‌టి రోజుల్ని ఎన్న‌టికీ మ‌రిచిపోలేం

ఎమ‌ర్జెన్సీ చీక‌టి రోజుల్ని ఎన్న‌టికీ మ‌రిచిపోలేం

ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఎమర్జెన్సీ చీకటి రోజులు ఎన్నటికీ మరపురావని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 1975లో విధించిన అత్యవసర పరిస్థితి 1977 వరకు కొనసాగిందని గుర్తు చేస్తూ ఈ కాలంలో భారత దేశపు ప్రజాస్వామిక లక్షణాలను కాంగ్రెస్ తన కాళ్ళక్రింద పడేసి తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

1975 నుంచి 1977 వ‌ర‌కు వ్య‌వ‌స్థీకృత ప‌ద్ధ‌తిలో అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేశార‌ని మండిపడ్డాయిరు. భార‌త్‌లో ప్ర‌జాస్వామ్య స్పూర్తిని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌తిజ్ఞ చేయాల‌ని ఈ సందర్భంగా ప్రధాని పిలుపిచ్చారు.  రాజ్యాంగంలో పొందుప‌రిచిన విలువ‌ల‌కు అనుగుణంగా న‌డుచుకోవాల‌ని కోరారు.

త‌న ట్విట్ట‌ర్‌లో ఖాతాలో ప్ర‌ధాని మోదీ ఈ అభిప్రాయాలను వ్య‌క్తం చేశారు. ప్ర‌జాస్వామ్య మూలాల‌ను కాంగ్రెస్ ధ్వంసం చేసింద‌ని, దానికి సంబంధించిన సాక్ష్యాల‌ను ప్ర‌ధాని త‌న ట్వీట్‌లో పొందుప‌రిచారు. ఇన్‌స్టాగ్రామ్ లింకు ద్వారా కాంగ్రెస్ చేసిన అకృత్యాల‌ను ఆయ‌న గుర్తు చేశారు.

ఎమ‌ర్జెన్సీని ఎంద‌రో హేమాహేమీల‌ను వ్య‌తిరేకించార‌ని, భార‌త ప్ర‌జాస్వామ్యాన్ని వారు ప‌రిర‌క్షించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. డార్క్ డేస్ ఆఫ్ ఎమ‌ర్జెన్సీ హ్యాష్‌ట్యాగ్‌తో మోదీ ఇన్‌స్టాలో కొన్ని అంశాల‌ను వెల్ల‌డించారు. 46 ఏళ్ల క్రితం ఇదే రోజున ప్ర‌ధాని ఇందిరా గాంధీ దేశ‌వ్యాప్తంగా ఎమ‌ర్జెన్సీని అమ‌లు చేశారు. ఎమర్జెన్సీని నిరసించి, భారత దేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన మహనీయులందరినీ మనం స్మరించుకుందామని పిలుపునిచ్చారు. 

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఇందిర అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు అల‌హాబాద్ హైకోర్టు త‌న తీర్పులో తెలిపింది. దీంతో ఆమెను ఆరేళ్ల పాటు పార్ల‌మెంట్ నుంచి బ‌హిష్క‌రించారు. ఆ స‌మ‌యంలో ప్ర‌ధాని ఇందిరా దేశ‌వ్యాప్త ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు. రాజ్యాంగ హ‌క్కుల్ని కాల‌రాశారు. పౌర స్వేచ్ఛ‌ను హ‌రించారు. మీడియాను తీవ్రంగా అణిచివేశారు. ఆ స‌మ‌యంలో అనేక మంది నేత‌ల్ని జైలు పాలు చేశారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఎమర్జెన్సీ కాలాన్ని గుర్తు చేసుకున్నారు. ఒక కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడే గొంతులను నొక్కేందుకు ఎమర్జెన్సీని విధించారని దుయ్యబట్టారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఎమర్జెన్సీ కాలమంతా చీకటి రోజులని పేర్కొన్నారు.