ఆలాపన్‌ రిటైర్మెంట్‌ ప్రయోజనాల నిలిపివేత!

పశ్చిమబెంగాల్‌ మాజీ ప్రధాన కార్యదర్శి ఆలాపన్‌ బంద్యోపధ్యాయ్‌కు వ్యతిరేకంగా తీవ్రమైన చర్యలను కేంద్రం ప్రారంభించింది. ఈ మేరకు ఆయనకు పదవీ విరమణ అనంతర ప్రయోజనాలు.. పింఛను, గ్రాట్యుటీ వంటి మొత్తంగా లేదా పాక్షికంగా, తాత్కాలిక సమయం లేదా శాశ్వతంగా అందకపోవచ్చు. 

ఈ మేరకు కేంద్ర సిబ్బంది శిక్షణశాఖ ఆలాపన్‌కు ఒక అడ్వైజరీని తాజాగా పంపించింది. ఆయన మీదున్న అభియోగాలను పేర్కొంటూ 30 రోజుల్లోగా ప్రత్యుత్తరం ఇవ్వాలని ఆదేశించింది. అఖిల భార‌త సేవ‌ల (క్ర‌మ‌శిక్ష‌ణ‌, అపీల్‌) నిబంధ‌న‌ల ప్ర‌కారం క‌ఠిన జ‌రిమానా చ‌ర్య‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించింది. 

వ్య‌క్తిగ‌తంగా లేక లిఖిత పూర్వ‌కంగా త‌న వాద‌న‌ను 30 రోజుల్లో తెలియ‌జేయాల‌ని పేర్కొంది. ఒక‌వేళ ఎలాంటి స‌మాధానం రాకపోతే ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా విచారణ జ‌రిపే అధికారం విచార‌ణ అధికారుల‌కు ఉంటుంద‌ని ఆ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది

తన ఉద్యోగ విరమణకు చివరి రోజులలో తుఫాన్ బాధిత ప్రాంతాలలో పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన సమీక్ష సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అల‌ప‌న్‌ గైరాజరు కావడంను కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన అంశంగా తీసుకొంది. అప్పటికే ఆయన పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుపై  మూడు నెలలపాటు పొడిగించింది.

దానితో వెంటనే,  కేంద్ర ప్ర‌భుత్వం వెన‌క్కి పిలిపించ‌గా ఆయ‌న స్పందించ‌లేదు. పైగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప‌ద‌వికి రాజీనామా చేసిన ఆయ‌నను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్య‌క్తిగ‌త  వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షించే సలహాదారునిగా నియమించారు. ఆయ‌న బ‌దిలీపై బెంగాల్‌, కేంద్ర ప్ర‌భుత్వం మ‌ధ్య వివాదం రాజుకోవడం తెలిసిందే.

దానితో కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఆయనకు విపత్తు యాజమాన్య చట్టం క్రింద షో కాజ్ నోటీసు జారీచేసింది. ఈ చట్టం ప్రకారం ఆయనమీద చేసిన అభియోగాలు రుజువైన పక్షంలో ప్రధాని సమావేశానికి గైరాజరైనందుకు రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ చట్టబద్ధ ఆదేశాలను తిరస్కరించే రీతిలో వ్యవహరించినట్లు ఆ నోటీసు పేర్కొన్నది.

శాఖపర దర్యాప్తులో గాని లేదా న్యాయస్థానం  ముందు గాని విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు రుజువైతే పెన్షన్, గ్రాట్యుటీ లను పాక్షికంగా గాని లేదా పూర్తిగా గాని నిలిపివేసే అధికారాన్ని సర్వీస్ నిబంధనలు కేంద్రప్రభుత్వానికి కలిగిస్తున్నాయి. అయితే ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ అధికారులు ఇటువంటి చర్యలకు గురికావడం సాధారణమే. వారి పరిపాలన ట్రిబ్యునల్ ను ఆశ్రయించి ఉపశమనం పొందే ప్రయత్నం చేస్తారు. కానీ అందుకు సుదీర్ఘ న్యాయ పక్రియను అనుసరింప వలసి ఉంటుంది.