భారత్, పాక్, చైనాలలో భారీగా పెరుగుతున్న అణ్వాయుధాలు 

తాజాగా భారత్, చైనా, పాకిస్థాన్ కూడా త‌మ ద‌గ్గ‌ర ఉన్న అణ్వాయుధాల‌ను భారీగా పెంచేసుకుంటున్నాయ‌ని స్టాక్‌హోమ్ ఇంట‌ర్నేష‌న‌ల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రి) వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం చైనా ద‌గ్గ‌ర 350, పాకిస్థాన్ ద‌గ్గ‌ర 165, భారత్ వద్ద 156 న్యూక్లియ‌ర్ వార్‌హెడ్స్ ఉన్నాయి. 

ఈ ఏడాది జ‌న‌వ‌రి వ‌ర‌కూ ఉన్న లెక్క‌లివి. వీటి సంఖ్య‌ను పెంచే ప‌నిలో మూడు దేశాలు ఉన్న‌ట్లు సిప్రి అధ్య‌య‌నం తేల్చింది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 13,080 అణ్వాయుధాలు ఉండ‌గా.. అందులో 90 శాతం అమెరికా, ర‌ష్యాల ద‌గ్గ‌రే ఉన్నాయి. భారత్, చైనా, పాకిస్థాన్‌, ర‌ష్యా, అమెరికాలే కాకుండా యూకే, ఫ్రాన్స్‌, ఇజ్రాయెల్‌, నార్త్ కొరియాలు కూడా ఈ అణ్వాయుధాల‌ను క‌లిగి ఉన్నాయి.

ఈ దేశాలు క‌లిగి ఉన్న ముడి ప‌దార్థాల గురించి కూడా సిప్రి అధ్య‌య‌నం వెల్ల‌డించింది. అణ్వాయుధాల కోసం వాడే ప్ర‌ధాన ముడి ప‌దార్థాలు యురేనియం, ప్లుటోనియం. వీటిలో ఇండియా, ఇజ్రాయెల్ ప్లుటోనియం నిల్వ‌ల‌ను స‌మ‌కూర్చుకోగా.. పాకిస్థాన్ యురోనియం నిల్వ‌ల‌ను పెంచుకున్న‌ద‌ని ఈ అధ్య‌య‌నం తెలిపింది. అయితే ప్లుటోనియం ఉత్ప‌త్తి సామ‌ర్థ్యాన్ని కూడా పాక్ పెంచుకుంటోంది.

అటు చైనా, ఫ్రాన్స్‌, ర‌ష్యా, యూకే, యూఎస్‌లు కూడా త‌మ అణ్వాయుధాల త‌యారీ కోసం పెద్ద మొత్తంలో యురేనియం, ప్లుటోనియం ఉత్ప‌త్తి చేసిన‌ట్లు అధ్య‌య‌నం బ‌య‌ట‌పెట్టింది. భారత్, పాకిస్థాన్‌లు త‌మ మిస్సైల్ ప‌రీక్ష‌ల గురించి చెప్పినా.. త‌మ ద‌గ్గ‌ర ఉన్న అణ్వాయుధ వివ‌రాల‌ను మాత్రం చెప్ప‌లేద‌ని ఈ స్ట‌డీ చెప్పింది.

ప్రపంచంలోని మొత్తం 13080 అణ్వాయుధాల్లో సుమారు 2 వేల ఆయుధాల‌ను ఉప‌యోగించ‌డానికి పూర్తి సంసిద్ధంగా ఉంచిన‌ట్లు కూడా సిప్రి అధ్య‌య‌నం స్ప‌ష్టం చేసింది. 

ఇక 2016 నుంచి 2020 మ‌ధ్య అత్య‌ధికంగా ఆయుధాల‌ను దిగుమ‌తి చేసుకున్న దేశాల జాబితాలో సౌదీ అరేబియా, భారత్, ఈజిప్ట్‌, ఆస్ట్రేలియా, చైనా ముందు వ‌రుస‌లో నిలిచిన‌ట్లు సిప్రి వెల్ల‌డించింది. మొత్తం ప్ర‌పంచ ఆయుధ దిగుమ‌తుల్లో సౌదీ అరేబియా వాటా 11 శాతం కాగా, భారత్  వాటా 9.5 శాతంగా ఉంది.