ఇజ్రాయిల్‌ లో గద్దెదిగిన నెతన్యాహు, కొత్త ప్రధానిగా బెన్నెట్‌ 

ఇజ్రాయిల్‌ ప్రధానిగా బెంజిమెన్‌ నెతన్యాహు 12 ఏళ్ల పాలనకు తెరపడింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. జాతీయ వాది నాఫ్తాలి బెన్నెట్‌, లాపిడ్‌లకు చెందిన పార్టీలతో కూడిన కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. నూతన ప్రధానిగా అల్ట్రానేషనలిస్ట్‌ పార్టీ అధినేత బెన్నెట్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

120 స్థానాలు గల పార్లమెంట్‌ నెస్‌సెట్‌లో ఆరు స్థానాలు మాత్రమే కల్గిన ఆయన పార్టీకి మరికొన్ని పార్టీలు మద్దతు ప్రకటించడంతో  మ్యాజిక్‌ నంబర్‌ రావడంతో నూతన ప్రభుత్వం ఏర్పాటైంది. నెతన్యాహును గద్దెదించాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న పార్టీలు, ఇదే అవకాశంగా తీసుకుని నాఫ్తాలికి మద్దతుగా నిలిచాయి. 

ఇప్పటికే కుదిరిన సంకీర్ణ ఒప్పందం ప్రకారం మొదటి రెండు సంవత్సరాలు ప్రధానిగా శత కోటీశ్వరుడైన బెనెత్‌, ఆ తరువాతి రెండు సంవత్సరాలు యేష్‌ అటిడ్‌ పార్టీ నేత యైర్‌ లాపిడ్‌ ప్రధానిగా ఉంటారు.  అయితే ప్రభుత్వం మారినా విధానాలలో పెద్దగా తేడా ఉండే అవకాశాలు కనిపించడం లేదు. 

పాలస్తీనా పట్ల నెతన్యాహూ అవలంభిస్తున్న వైఖరినే బెన్నెట్‌ కూడా అనుసరిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతిపక్షంలో కూర్చోవటమే విధి అయితే మేము హుందాగా కూర్చుంటామని గద్దె దిగేముందు నెతన్యాహు ప్రకటించారు. అయితే, త్వరలోనే ఈ చెడు పాలనకు అంతం పలికి, తిరిగి అధికారంలోకి రాగలమనే ఆశాభావం వ్యక్తం చేశారు. 

గతంలోలా ఇజ్రాయిల్ లో ఎన్నడూ ఎరుగని విభిన్నమైన పార్టీలు కలసి సంకీర్ణంగా ఏర్పడ్డాయి. నూతన ప్రధానికి 120 మంది సభ్యులున్న పార్లమెంట్ లో కేవలం 60 మంది మాత్రమే మద్దతుగా ఓట్ వేయడం గమనార్హం. కాగా, ఇజ్రాయెల్‌ దేశానికి కొత్తగా ప్రధానమంత్రి అయిన న‌ఫ్తాలీ బెనెట్ ను భారత ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు మోడీ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.

‘‘ఇజ్రాయెల్‌ ప్ర‌ధాని అయిన సంద‌ర్భంగా బెనెట్ కు ఇవే నా అభినంద‌న‌లు. దౌత్య సంబంధాల ఉన్న‌తీక‌ర‌ణ కు 30 ఏళ్ళు అవుతున్న సంద‌ర్భాన్ని వ‌చ్చే ఏడాది మ‌నం వేడుక‌ గా జ‌రుపుకోనున్న త‌రుణంలో మీతో భేటీ కావ‌డం కోసం, మ‌న రెండు దేశాల మ‌ధ్య ఉన్న వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని మరింత బలంగామార్చుకోవ‌డం కోసం నేను వేచిచూస్తున్నాను’’ అని ట్వీట్టర్ ద్వారా ప్ర‌ధాన మంత్రి మోదీ పేర్కొన్నారు.