కాశ్మీర్ కు  రాష్ట్ర ప్రతిపత్తి, అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు!

కాశ్మీర్ కు  రాష్ట్ర ప్రతిపత్తి, అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు!
జమ్మూ, కాశ్మీర్ లో నెలకొన్న అసాధారణ పరిస్థితుల దృష్ట్యా ఆగష్టు, 2019లో ఆర్టికల్ 370ని  రద్దు చేసే సమయంలో ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రం విభజించడాం తెలిసిందే. ఆ సమయంలో రాష్ట్రంలో సద్దునమనగానే జమ్మూ, కాశ్మీర్ కు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరిస్తామని కేంద్ర  హోమ్ మంత్రి అమిత్ షా హామీ ఇవ్వడం తెలిసిందే. 
 
ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అదుపులోకి రావడంతో,  సాధారణ పక్రియను ప్రారంచించడానికి కేంద్రం సిద్ధమవుతున్నది. అందులో భాగంగా రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించి, అసెంబ్లీకి  జరపడం కోసం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది.  ఎన్నికల కోసం జమ్ముక‌శ్మీర్ పార్టీలతో చర్చలకు ఏర్పాట్లు ప్రారంభించింది.
గుప్కర్ కూడా ప్ర‌భుత్వంతో చ‌ర్చించేందుకు త‌మ సంసిద్ధ‌త తెలిపిన‌ట్లు స‌మాచారం. ఈ విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కు ఎవ్వ‌రికి కూడా అధికారిక ఆహ్వానం అంద‌లేదు. పీడీపీతో పొత్తును విరమించుకుంటున్న‌ట్లు బీజేపీ ప్రకటించిన తర్వాత‌ 2018 జూన్‌లో జమ్ముక‌శ్మీర్‌లో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. అప్పటి నుంచి అక్కడ రాజకీయ కార్యకలాపాలు స్తంభించాయి. ఆ తర్వాత 2019 లో 370 ఆర్టికల్‌ను కేంద్రం రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. 

అయితే 2019 సాధారణ ఎన్నికలతో కలిపే జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం తలపోసింది. అయితే అక్కడి స్థానిక పరిస్థితులు, భద్రతా పరమైన అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం… వెనకడుగు వేసింది.  రాష్ట్రపతి పాలన సమయంలోనే చాలాకాలం త‌ర్వాత గ్రామ‌పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లు జ‌రిపారు. తొలిసారిగా గ్రామీణ ప్రాంతాలలో రాజకీయ పక్రియ ప్రారంభం కావడం ప్రారంభమైనది.

ఇన్నిరోజుల త‌ర్వాత తిరిగి ఎన్నిక‌ల ఊసెత్త‌డంతో రాజ‌కీయ పార్టీల్లో ఉత్సాహం మొద‌లైంది. కేంద్రం చేప‌ట్టే చ‌ర్చ‌ల్లో చేరేందుకు పీడీపీ, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్‌తోపాటు ఏడు పార్టీల గుప్క‌ర్ సంసిద్ధ‌త తెలిపిన‌ట్లు తెలుస్తున్న‌ది. డీలిమిటేషన్‌కు సంబంధించిన చర్చల్లో పాల్గొంటామని గుప్క‌ర్ నాయ‌కులు తెలిపారు.

జమ్మూ, కాశ్మీర్ చరిత్రలో మొదటిసారిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక రాజకీయ నాయకుడు – సత్పాల్ మాలిక్ ను గవర్నర్ గా నియమించడం ద్వారా ఈ ప్రాంతంలో సాధారణ రాజకీయ పక్రియ పట్ల ఆసక్తిని చూపింది. 

అప్పటి వరకు కేవలం  సైనిక అధికారులు, ప్రభుత్వ అధికారులు మాత్రమే గవర్నర్ లుగా ఉన్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడిన తర్వాత కూడా ప్రస్తుతం లెఫ్టనెంట్ గవర్నర్ గా రాజకీయ నాయకుడు మనోజ్ సిన్హా వ్యవహరిస్తున్నారు. 

రాజకీయ నాయకుడు పరిపాలనాధిపతిగా ఉంటూ ఉండడంతో రాజకీయ నాయకులకు, సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. సాధారణ రాజకీయ ప్రకియ పునరుద్దరణకు సానుకూల వాతావరణం ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. 

జమ్మూ కశ్మర్‌లో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని జమ్మూ పర్యటనకు వెళ్లిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొనడం గమనార్హం. గత రెండేళ్లుగా లోయలో చెదురుమదురు సంఘటనలు మినహా  ఎలాంటి చెప్పుకోదగిన ఉగ్రవాద కార్యకలాపాలు జరగండంలేదని స్పష్టం చేశారు.