
పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల అనంతరం ప్రారంభమైన రాజకీయ హింస ఇంకా ఆగడం లేదు. చివరకు పార్లమెంట్ సభ్యులపై కూడా దాడులు జరుపుతున్నారు. తాజాగా బీజేపీ ఎంపీపై దాడి జరిగింది. సిలిగురిలో శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో టీఎంసీ గూండాలు తనపై దాడి చేసినట్లు జల్పాయిగురి ఎంపీ డాక్టర్ జయంత కుమార్ రాయ్ ఆరోపించారు.
దుండగులు తన తల, చేతులపై వెదురు కర్రలతో కొట్టారని అన్నారు. తనతో పాటు మరికొందరిపైనా సుమారు 150 మంది టీఎంసీ గుండాలు దాడి చేశారని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో చట్ట నియమం లేదని ఆయన మండిపడ్డారు. తనతో పాటు కారులో ఉన్న మరో ఇద్దరికీ కూడా గాయాలయ్యాయని, వారు కూడా ఆసుపత్రిలో చేరారని తెలిపారు.
కాగా, ఎంపీ జయంత కుమార్ రాయ్ తల, పొత్తికడుపుపై దెబ్బలు తగిలాయని సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సర్జరీ హెడ్ డాక్టర్ ఎ.ఎన్. సర్కార్ తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని చెప్పారు. ఈ దాడిని రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు సువెంద్ అధికారి తీవ్రంగా ఖండించారు. గాయపడిన బిజెపి ఎంపీ రాయ్ సత్వరం కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజకీయ హింస కారణంగా పారిపోయి, భండారిగుంజ్ ప్రాంతంలో సహాయ శిబిరంలో ఉంటున్న వారిని సందర్శించి, వారిని తిరిగి తమ ఇళ్లకు రమ్మనమని కోరి ఎంపీ తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది. బిజెపి నాయకుల కధనం ప్రకారం మే 2 తర్వాత జరిగిన రాజకీయ హింసలో 40 మందికి పైగా బిజెపి కార్యకర్తలు మృతి చెందగా, 40 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.
More Stories
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్