ఈటెల బీజేపీలోకి రావడం అంటేనే  కేసీఆర్ ఓడటం 

ఈటెల బీజేపీలోకి రావడం అంటేనే  కేసీఆర్ ఓడటం 
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీలోకి రావడం అంటేనే కేసీఆర్ ఓడటం.. ఆయన అహంకారం ఓడటం అని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ స్పష్టంచేశారు. రాష్ట్రంలో తెలంగాణ ఆత్మాభిమానానికి, ఒక వ్యక్తి అహంకారానికి మధ్య  పోరాటం జరుగుతోందని తెలిపారు.
ఈటెల రాజేందర్ తన శాసనసభ్యత్వంకు రాజీనామాను స్పీకర్ కార్యాలయంలో సమర్పించిన అనంతరం రాష్ట్ర బిజెపి కార్యాలయంకు వచ్చినప్పుడు ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా తరుణ్ ఛుగ్ మాట్లాడుతూ కేసీఆర్  నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఈటల రాజేందర్ గళం విప్పారని కొనియాడారు.

ఈటల రాజేందర్ గళం తెలంగాణ సమాజ మనోగతం అని,  అయితే నియంతృత్వ పోకడతో ఆ గళాలను అణచివేస్తున్నారని ఆరోపించారు. “ఇన్నాళ్లు టీఆర్‌ఎస్‌లో సంఘర్షణకు గురయ్యారు. తనను నమ్మిన ప్రజల బాగు కోసం అనేక రకాలుగా ప్రయత్నించారు. కేసీఆర్‌కు ఆయన కుటుంబం ఎక్కువ అయింది.. తెలంగాణ గౌరవం చులకన అయింది” అంటూ విమర్శించారు.

ఈటెల పోరాటానికి బీజేపీ మద్దతు పలుకుతుందని చెబుతూ తెలంగాణలో కుటుంబ పాలన, ఓ వ్యక్తి అహంకారం, నియంతృత్వం తొలగిపోవాలని, ప్రజల మాట వినాలని పిలుపిచ్చారు. దీని కోసం తెలంగాణ నుంచి ఎంతమంది వచ్చినా బీజేపీ తరపున స్వాగతిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి, గౌరవం, అవినీతి రహిత పాలన ఉండాలన్నదే బీజేపీ అభిమతం అని తెలిపారు.

రాష్ట్ర బిజెపి కార్యాలయంలో బిజెపి నేతలతో జరిగిన భేటీలో పార్టీ తరుణ్ చుంగ్, శాసన సభ్యులు రఘునందనరావు, రాజాసింగ్‌, జాతీయ ఓబిసి మోర్చా అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్‌లు తదితరులు పాల్గొన్నారు.

తొలుత బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, విజయశాంతి తదితరులతో సమావేశమై చర్చించారు. అనంతరం షామీర్ పేటలోని మాజీ మంత్రి ఈటెల నివాసానికి వెళ్లి కలిశారు.