జూహీచావ్లాకు షాక్‌.. 20లక్షల జరిమానా

5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా బాలీవుడ్ సీనియర్ నటి  జూహీ చావ్లా దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది.  శుక్రవారం పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు 5జీ టెక్నాలజీ వద్దన్న ఆమె విజ్ఞప్తిని తిరస్కరించింది. టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ కావాల్సిందేనని స్పష్టీకరించింది.

అయితే, కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు జూహీ అభిమాని సినిమా పాటలు వినిపించటం, ప్రొసీడింగ్స్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసినందుకు కోర్టు ఆమెపై సీరియస్‌ అయింది. దీనివ‌ల్ల మూడుసార్లు విచార‌ణ‌కు అడ్డంకులు ఎదుర‌య్యాయ‌ని కోర్టు చెప్పింది. రూ.20 లక్షల జరిమానా విధించింది.

కోర్టును ఆశ్రయించేకంటే ముందు ప్రభుత్వానికి ఈ విషయమై లేఖ రాయాల్సిందని అభిప్రాయపడింది.  ఇక విచార‌ణ సంద‌ర్భంగా అడ్డంకులు సృష్టించిన వ్య‌క్తుల‌ను ప‌ట్టుకొని, త‌గిన చర్య‌లు తీసుకోవాల‌ని ఢిల్లీ పోలీసుల‌ను కోర్టు ఆదేశించింది. పిటిషన్లో బలం లేదని, అనవసరంగా దాఖలు చేశారని పేర్కొంది. ఆమె న్యాయ వ్య‌వ‌స్థ‌ను దుర్వినియోగం చేసింద‌ని కోర్టు తీర్పు స్ప‌ష్టం చేసింది. ఈ దావా కేవ‌లం ప‌బ్లిసిటీ కోసం వేసిన‌ట్లుగా ఉన్న‌ద‌ని ఈ సంద‌ర్భంగా కోర్టు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

కాగా, 5జీ టెక్నాలజీ వల్ల తీవ్రమైన ప్రమాదాలు ఉన్నాయని, పౌరులకు ఎలాంటి ప్రమాదం లేదని ప్రభుత్వం ధ్రువీకరించేవరకూ 5జీని ఆపాలని కోరుతూ జూహీచావ్లాతో సహా మరో ఇద్దరు పిటిషనర్లు ఢిల్లీ  హైకోర్టును ఆశ్రయించారు.

దాదాపు 5 వేల పేజీల ఈ పిటిషన్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లాంటి ఏజెన్సీలతో పాటు విశ్వవిద్యాలయాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థను పక్షాలుగా చేర్చారు.