అంతరిక్షయాత్రకు తెలంగాణ సంతతి సారథ్యం

రోదసి ప్రయోగాల్లో దూసుకుపోతున్న ప్రైవేట్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్‌ఎక్స్‌’, నాసాతో కలిసి ఈ ఏడాది అక్టోబర్‌ 23న ‘స్పేస్‌ ఎక్స్‌ క్రూ 3’ మిషన్‌ను ప్రయోగించనున్నది. ఈ మిషన్‌ ద్వారా నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఆరు నెలల పాటు గడుపనున్నారు.

అంతరిక్ష ప్రయోగాల్లో మరో మైలురాయిగా నిలిచిపోయే ఈ మిషన్‌కు తెలంగాణ మూలాలున్న రాజా జాన్‌ వుర్పుటూర్‌ ‘గ్రైండర్‌’ చారి (రాజాచారి) నేతృత్వం వహిస్తున్నారు. ఆయన తండ్రి శ్రీనివాస్‌ చారి పాలమూరుకు చెందినవారు. ఈ క్రమంలో రాజాచారి ‘తెలంగాణ టుడే’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు:

కోచ్‌లా దిశానిర్దేశం చేస్తా!
‘వ్యోమగామి కావాలని జీవితంలో ఏదో ఒక సందర్భంలో ప్రతీ పిల్లాడు కలగంటాడు. చిన్నతనంలో నేను సైన్స్‌-ఫిక్షన్‌ సినిమాలను చాలా చూసేవాడిని. అలా ఆకాశంలో విహరించాలని కోరుకునేవాడిని. అయితే, వ్యోమగామినే కావాలన్న నిర్దిష్ట లక్ష్యమనేది ఉండేది కాదు. విమానాన్ని నడిపే పైలట్‌ కావాలన్న కోరిక మాత్రం ఉండేది.

కొలొరాడోలోని యునైటెడ్‌ స్టేట్స్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో చేరా. మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి ఎరోనాటిక్స్‌ అండ్‌ ఆస్ట్రోనాటిక్స్‌లో మాస్టర్స్‌ చేశా. 2017 జూన్‌లో నాసాలో టెస్ట్‌ పైలట్‌గా చేరడాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ‘స్పేస్‌ఎక్స్‌ క్రూ 3 మిషన్‌’లో నా బాధ్యత ఎంతో కీలకమైనది. 

ఈ మిషన్‌కు కమాండర్‌గా ఉన్నా. క్రీడారంగంలో జట్టుకు కోచ్‌ మార్గనిర్దేశనం చేస్తాడు. అయితే, ఆట ఎలా ఆడాలో క్రీడాకారులకు కూడా తెలుసు. అదే విషయాన్ని కోచ్‌ మళ్లీ చెప్తే లాభం ఉండదు. ఏ ప్లేయర్‌ను ఎక్కడ వినియోగించాలి. ఆటలో ఎలా నెగ్గాలి? అనే అంశాలపై కోచ్‌ దృష్టిసారించాల్సి ఉంటుంది. 

ప్రస్తుతం ‘స్పేస్‌ఎక్స్‌ క్రూ 3 మిషన్‌’ విజయానికి నేను కూడా అదే పని చేస్తున్నా. ఐఎస్‌ఎస్‌కి వెళ్లడానికి ఎంతో ఆసక్తితో ఉన్నా. తర్వాత జరిగే చంద్రమండల యాత్ర కోసం కూడా ఎదురుచూస్తున్నా’ అని చారి అన్నారు.

ట్యాంక్‌బండ్‌పై చక్కర్లు
హైదరాబాద్‌లో తన మిత్రులు, బంధువులు ఉన్నట్టు రాజాచారి తెలిపారు. ఇప్పటివరకూ సిటీకి మూడుసార్లు వచ్చినట్టు చెప్పారు. టీనేజర్‌గా ఉన్నప్పుడు మిత్రులతో కలిసి ట్యాంక్‌బండ్‌పై తిరిగినట్టు ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. హైదరాబాద్‌ ఫుడ్‌ను ఎంతో ఇష్టంగా తినేవాడినని, తెలుగు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించానని చెప్పారు. అయితే, ఇప్పుడు తెలుగు మర్చిపోయానని నవ్వారు.

నేపథ్యమిది
రాజాచారి జూన్‌ 24, 1977లో అమెరికాలోని విస్కాన్సిన్‌లో జన్మించారు. ఆయన తండ్రి శ్రీనివాస్‌ చారి ఉస్మానియా వర్సిటీలో ఇంజినీరింగ్‌ చేశారు. శ్రీనివాస్‌చారి తండ్రి మహబూబ్‌నగర్‌కు చెందినవారు. ఆయన ఉస్మానియా వర్సిటీలో గణితం ప్రొఫెసర్‌గా పనిచేశారు. డిగ్రీ అనంతరం ఉన్నత చదువుల కోసం శ్రీనివాస్‌ చారి అమెరికా వెళ్లారు. అక్కడే పెగ్గీ అనే మహిళను వివాహం చేసుకున్నారు. కాగా, రాజాచారికి భార్య హోలీ స్కాఫ్టర్‌, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2,500 గంటలపాటు ఎఫ్‌ సిరీస్‌ కాంబాట్‌ ఫ్లైట్‌లను రాజాచారి నడిపారు.