సైన్యంలో చేరిన పుల్వామా అమరుడి భార్య 

2019లో జమ్ముకాశ్మీర్‌లో పుల్వామా దాడిలో అశువులు బాసిన మేజర్‌ విభూతి శంకర్‌ దౌండియాల్‌ భార్య నికితా కౌల్‌ శనివారం ఆర్మీలో చేరారు. తన భర్త అడుగుజాడల్లో నడుస్తూ శనివారం కమాండర్‌గా బాధ్యతలు చేపట్టి ధీర వనితగా నిరూపించుకున్నారు. 
 
నార్త్‌ ఆర్మీ కమాండ్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ వైకె జోషి ఆమె భుజంపై నక్షత్రాలను పెట్టారు. దీనికి సంబంధించిన కార్యక్రమం తమిళనాడులోని చెన్నైలో ఆఫీసర్‌ ట్రైనింగ్‌ అకాడమీలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను పిఆర్‌ఒ ఉదంపూర్‌, రక్షణ శాఖ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది.

2019లో ఫిబ్రవరిలో కాశ్మీర్‌లో పుల్వామాలో ఉగ్రదాడిలో మేజర్‌ శంకర్‌ ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు అప్పటికి పెళ్లయి తొమ్మిది నెలలే అయింది. చిన్న వయస్సులోనే భర్తను కోల్పోయినప్పటికీ పంటి కింద కన్నీటిని ఆపుకుని, దేశ కోసం తన భర్త ప్రాణాలు అర్పించారని గర్వంగా ఉందని పేర్కొంటూ ఆమె అంత్యక్రియలు ముగించారు.

27 ఏళ్ల వ‌య‌స్సులోనే భ‌ర్త‌ను కోల్పోయిన భార్య నిఖిత కౌల్‌ను చూసి అంద‌రూ బాధ‌ప‌డ్డారు. ఆమె మాత్రం జాలి కాదు.. గ‌ర్వ‌ప‌డ‌మ‌ని చెప్పారు. అంతేకాదు భ‌ర్త మీద ప్రేమ‌తో ఆయ‌న బాధ్య‌త‌ను పంచుకున్నారు. ఢిల్లీలో బహుళజాతి సంస్థలో చేస్తున్న మంచి ఉద్యోగాన్ని వ‌దిలేసి సైన్యంలో చేరేందుకు శిక్ష‌ణ తీసుకున్నారు. త‌న భ‌ర్త శిక్ష‌ణ పూర్తి చేసిన చెన్నైలోని ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీలోనే ఆమె కూడా సీటు సాధించి శిక్ష‌ణ తీసుకున్నారు. 

ఈ సంద‌ర్భంగా ఆమె త‌న భ‌ర్త‌ను గుర్త‌చేస్తూకొంటూ త‌న ప్ర‌యాణం ఇప్పుడే మొద‌లైంద‌ని ఆమె చెప్పారు. విభూ వ‌దిలి వెళ్లిన మార్గాన్ని తాను కొన‌సాగించ‌నున్న‌ట్లు తెలిపారు. త‌న‌ మీద న‌మ్మ‌కం ఉంచిన ప్ర‌తి ఒక్క‌రికీ ఆమె ధ‌న్య‌వాదాలు తెలిపారు. “ఐ ల‌వ్ యూ విభూ ఎప్ప‌టికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను” అని చెప్పుకొచ్చారు

ఇప్పుడు ఆయనపై ప్రేమతో తాను కూడా ఆర్మీలో చేరి దేశ సేవకు సిద్ధమయ్యారు. ఆర్మీలో చేరాలన్న ఆమె నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు. కాగా, అమరుడైన శంకర్‌కు భారత ప్రభుత్వం శౌర్య చక్ర (మరణానంతరం) అవార్డును అందించింది.
 
కాగా దీనిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్విట్టర్‌లో స్పందిస్తూ నితికా కౌల్‌కు అభినందనలు తెలిపారు. “లెఫ్టినెంట్-నితికా కౌల్, మీరు భారతదేశ నారీ శక్తి స్వరూపం. మీ అంకితభావం, సంకల్పం, భక్తి గొప్పది. మేజర్ విభూతి ధౌండియాల్ ఈ రోజు మీ భుజంపై ఉన్న నక్షత్రాలను చూసి ఆనందం, గర్వంతో నవ్వుతారు.’’ అంటూ ట్వీట్‌ చేశారు.