అనాథ బాలల‌కు ఉచిత విద్య‌, అనాధ కుటుంబాలకు పింఛన్

కొవిడ్-19తో త‌ల్లితండ్రుల‌ను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారుల‌ను పీఎం కేర్స్ ఫ‌ర్ చిల్డ్ర‌న్ స్కీమ్ కింద ఉదారంగా ఆదుకుంటామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ  ప్ర‌క‌టించారు.  క‌రోనాతో ప‌లువురు చిన్నారులు త‌మ త‌ల్లితండ్రుల‌ను, సంర‌క్ష‌కుల‌ను కోల్పోయార‌ని, వీరంద‌రూ గౌర‌వంతో బ‌తుకుతూ మెరుగైన అవ‌కాశాలు ద‌క్కించుకునేలా ప్ర‌భుత్వం చొర‌వ చూపుతుంద‌ని ప్ర‌ధాని ట్వీట్ చేశారు.

కోవిడ్ కారణంగా అనాథలైన పిల్లల విషయంలో ఏం చేద్దామన్న విషయంపై ప్రధాని మోదీ శనివారం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ 10 లక్షల రూపాయల కార్పస్ ఫండ్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

ఈ నిధులను పీఎం కేర్‌ఫండ్ నుంచి ఇవ్వనున్నారు. ఉన్నత విద్యా కాలంలో వారి అవసరాలను తీర్చడానికి నెలవారీ స్టైఫండ్‌ను ఈ కార్పస్ ఫండ్ నుంచి కేటాయించనున్నారు. వారికి 23 ఏళ్లు వచ్చే సరికి వ్యక్తిగత, కెరీర్ అవసరాల నిమిత్తం ఆ కార్పస్ ఫండ్ మొత్తాన్ని ఒకేసారి ఇవ్వాలని మోదీ నిర్ణయించారు. 

అంతేకాకుండా వారందరికీ ఉచితంగా విద్యనందించాలని కేంద్రం నిర్ణయించింది. ‘‘పిల్లలే దేశానికి పెద్ద ఆస్తి. వారే భవిష్యత్తు. వారి కోసం ఎంతైనా చేస్తాం. వారందర్నీ కాపాడుకుంటాం. అది మా బాధ్యత కూడా. వారి ఉజ్వల భవిష్యత్తు కోసమే ఈ పథకం’’ అని మోదీ వివరించారు. పీఎం కేర్స్ ఫ‌ర్ చిల్డ్ర‌న్ ఇలాంటి పిల్ల‌లకు మెరుగైన విద్య‌, ఆరోగ్య బీమా వంటి వ‌స‌తుల‌ను స‌మ‌కూరుస్తుంద‌ని తెలిపారు.

కాగా, కుటుంబపోషకులుగా ఉంటూ కొవిడ్-19 వల్ల మృతి చెందితే, వారిపై ఆధారపడిన కుటుంబసభ్యుల(డిపెండెంట్స్) కోసం కొత్త పింఛన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది నుంచి రెండేళ్లపాటు కరోనా బారిన పడి మరణించినవారి కుటుంబసభ్యులకు ఈ పథకం వర్తిస్తుంది.

ఉద్యోగుల బీమా పథకాన్ని(ఇడిఎల్‌ఐ) కూడా వారికి వర్తింపజేయనున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం(పిఎంఒ)  కొవిడ్19 వల్ల మృతి చెందిన కార్మికులు పొందిన సగటు వేతనంలో 90 శాతాన్ని పింఛన్‌గా ఇవ్వనున్నట్టు పేర్కొన్నది. 

కరోనా మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబసభ్యులకు ఇడిఎల్‌ఐ పథకం వర్తిస్తుందని తెలిపింది. ఈ ప్రయోజనాలు 2020 మార్చి 24 నుంచి 2022 మార్చి 24 వరకు మృతి చెందినవారి కుటుంబసభ్యులకు వర్తిస్తాయి. ఈ పథకాలకు సంబంధించిన మార్గదర్శకాలను కార్మిక మంత్రిత్వశాఖ జారీ చేస్తుందని పిఎంఒ తెలిపింది.